జిల్లాలోని ఉపాధి
కూలీల సమాచారం
ప్రత్యామ్నాయ చర్యలు..
● ఉపాధి కూలీలు, సిబ్బందిని సతాయిస్తున్న ఫేస్ రికగ్నేషన్ సిస్టం ● సిగ్నల్, సర్వర్ డౌన్ సమస్యలతో హాజరు నమోదులో ఆలస్యం ● ఎండలో పనిచేసినా మస్టర్ పడకపోవడంతో వేతనం కట్ ● జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న ఫీల్ట్ అసిస్టెంట్ల కొరత
అశ్వారావుపేటరూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ కూలీలకు శాపంగా మారుతోంది. యాప్ ద్వారానే కూలీల హాజరు నమోదు కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్య కారణంగా ఉపాధి పనికి వస్తే ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి యాప్‌లో ఒక్కో కూలీకి వ్యక్తిగతంగా ఐరిస్ విధానంలో హాజరు నమోదు చేస్తున్నారు. హాజరు నమోదులో ఆలస్యం కావడం, గంటల కొద్దీ ముఖ హాజరుకే సమయం పట్టడంతో కూలీల్లో అసహనం వ్యక్తమవుతోంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఒక్కో మేట్‌కు 40 మంది
ఉపాధి హామీ పథకంలో సిబ్బంది కొరత కారణంగా యాప్‌లో కూలీల హాజరు నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. గతంలో పని ప్రదేశంలో కూలీ లను సమూహంగా ఒక్క ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే సరిపోయేది. తాజాగా యాప్ విధానం ద్వారా ప్రతి ఒక్క కూలీని విడివిడిగా ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ప్రతి కూలీ ఫేస్ రికగ్నేషన్ కోసం ఫీల్ట్ అసిస్టెంట్లు గంటల కొద్దీ సమయం గడపాల్సి వస్తోంది. యాప్‌నకు సిగ్నల్ అందకపోయినా, సర్వ ర్ డౌన్ అయినా కూలీల ఫొటోలు అప్‌లోడ్ కావడంలేదు. దీంతో పని చేసినా వేతనం రావడం లేదు. ఫలితంగా సాంకేతిక సమస్యలు వస్తే కూలీలు ఆ రోజు పని చేయకుండానే వెనుతిరుగుతున్నారు. ఈ సమస్య కారణంగా జిల్లాలో రోజూ 400 నుంచి 500 మంది కూలీలు పనులకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత నేపథ్యంలో గతంలో ఉన్న మేట్ వ్యవస్థను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. అశ్వారావుపేట మండలలాన్ని పరి శీలిస్తే 27 గ్రామ పంచాయతీలకు కేవలం 14 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో మేట్లతో కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న మేట్లను గుర్తించి యాప్‌పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఒక్కో మేట్‌కు 40 మంది కూలీలను కేటాయించి, వారితో హాజరు నమోదు చేయిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అవస్థలు
యాప్‌లోఫొటోలు అప్‌లోడ్, కూలీల హాజరు నమో దు ప్రక్రియ పట్టణ సమీప ప్రాంతాల్లో సాఫీగానే సాగుతుండగా, మారుమూల ప్రాంతాల్లో అవస్థలు తప్పడం లేదు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల్లో సిగ్నల్ సమస్య సతాయిస్తోంది. అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడెం, నందిపాడు, కుడుములపాడు, కొత్త కావడిగుండ్ల, కంట్లం, మొద్దులమడ, దిబ్బగూడెం(దురదపాడు), గాడ్రాలతోపాటు మరికొన్ని గిరిజన గ్రామాల్లో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయి.
గ్రామపంచాయతీల సంఖ్య: 481
యాక్టివ్ కూలీల సంఖ్య : 2,02,000
జాబ్ కార్డుల సంఖ్య: 1,23,000
జిల్లాలో ఎన్‌ఎస్‌ఎస్‌ఎం విధా నం 85శాతం మేర అమలు అవుతోంది. వంద శాతం అమలుకు కృషి చేస్తున్నాం. సాంకేతిక, సిగ్నల్, ఎర్రర్ సమస్యలు వచ్చే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. సిగ్నల్ లేని ప్రాంతాల్లో యాప్ ద్వారా హాజరు లేకుండా, నో లొకేషన్ ఏరియా ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా కొన్ని ప్రాంతాల్లో కొంతమేర సమస్య ఉన్న మాట వాస్తవమే.
– నల్లబోతుల రవి, డీఆర్‌డీఏఏపీడీ


