సమయపాలన లేని రేషన్ దుకాణాలు
డీలర్ల కోసం లబ్ధిదారుల
ఎదురుచూపులు
మూడు నెలల కోటా ఇస్తుండటంతో పెరిగిన డిమాండ్
బినామి పేర్లపై పలు రేషన్ దుకాణాలు!
కొత్తగూడెంఅర్బన్: ముదురుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గానూ మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. మళ్లీ జూలైలోనే బియ్యం పంపిణీ చేస్తారు. రేషన్‌షాపుల నుంచి బియ్యంను తీసుకునేందుకు లబ్ధిదారులు క్యూకడుతున్నారు. ప్రతీ నెల 15వ తేదీ వరకే బియ్యం పంపిణీ చేయడం, ఆ తరువాత ఒకటి, రెండు రోజులు పొడగింపు ఉండడం వల్ల లబ్ధిదారులు చివరి తేదీ వరకు కూడా బియ్యం తీసుకునే వారు. కానీ, ఈసారి మూడు నెలల బియ్యం కావడంతో చివరి తేదీ వరకు ఆగకుండా ముందస్తుగానే రేషన్‌షాపుల వద్దకు వచ్చి బియ్యం తీసుకుంటున్నారు. అయితే, డీలర్లకు సమయపాలన లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపులు తీయడం, మూసివేయడానికి స్పష్టమైన సమయం కేటాయించడంలో డీలర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. బియ్యం అక్రమ దందాలో డీలర్లు కూడా చేతులు కలిపి, వారు ఎప్పుడు షాపులను తెరుస్తున్నారో తెలియడంలేదు. బియ్యం తీసుకోకుండా ఎంతమంది డబ్బులు తీసుకుంటు న్నారు? ఎంత బియ్యం మిగులుతోంది? ఎక్కడికి వాటిని తరలించాలనే విషయాలపైనే వారంతా కూడా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. దీంతో షాపుల సమయపాలన గాలికి వదిలేశారు. అయితే, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం సమయపాలన పాటించకపోతే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే షాపులను సీజ్ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇందుకు డీలర్లు భయపడి సమయానికి షాపులు తెరచి బియ్యం లబ్ధిదారులకు అందిస్తారో, లేదో వేచి చూడాలి.
రేషన్‌షాపుల సమయాలు ఇలా..
జిల్లాలో 442 రేషన్ షాపులుండగా డీలర్లు వారికి ఇష్టం వచ్చిన సమయంలో తెరస్తున్నారు. దీంతో షాపుల ముందు లబ్ధిదారులు పడిగాపులు కాయల్సిన దుస్థితి నెలకొంది. కొంత మంది డీలర్లు ఉదయం షాపులు తీస్తే, మరికొంత మంది మధ్యాహ్నం, సాయంత్ర వేళలో తీస్తున్నారు. అయితే రేషన్‌షాపులు తీయడానికి, మూసివేయడానికి కూడా సమయం కేటాయించినప్పటికీ వాటిని డీలర్లు ఎవరూ పాటించడం లేదని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. ఇకపై షాపులు సమ యానికి తీయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రేషన్‌షాపులు ఉదయం 8 గంటల కల్లా తీసి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచి ఉంచాలని, దీంతో పాటు సాయంత్రం 4 గంటలకు తీసి రాత్రి 8 గంటల వరకు షాపులు తెరచి ఉంచాలంటున్నారు. ఈ సమయాలు రానున్న రోజుల్లో ఎంత మంది డీలర్లు పాటిస్తారో వేచి చూడాలి.
బినామీ పేర్లతో నిర్వహణ..
జిల్లాలో ఉన్న మొత్తం 442 రేషన్‌దుకాణాలు వీటి లో చాలా వరకు బినామీల పేర్లతో నడుస్తున్నాయి. ఒక్క డీలర్‌కు మూడు, నాలుగు దుకాణాలున్నా యి. వాటిని వారి బంధువుల బినామీ పేర్లతో నడిపిస్తున్నారు. దీంతో కొత్త వారికి, ఆసక్తి ఉన్న వారికి అవకాశాలు రాకుండా పోతున్నాయి. ఇతర జిల్లాల్లో బినామీలను అధికారులు ఏరి పడేసి, వాటిల్లో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు గానూ నోటిఫికేషన్లు జారీచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం పదేళ్లుగా రేషన్ దుకాణాలకు ఒక్క నోటిఫికేషన్ విడుదల కాలేదంటే ఏ స్థాయిలో మేనేజ్‌మెంట్ జరుగుతుందో జిల్లా అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవరసముంది. రేషన్ డీలర్లు కొంత మంది వారి బినామీ దుకాణాలను లీజుకు ఇవ్వడంతో పాటు, లీజు అయిన తరువాత కొత్త వారికి ఇవ్వడం, ఏడాదికి, నెలకు వాటిపై అదనపు ఆదా యం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా కొన్ని రేషన్‌దుకాణాల వారు, వారి కుటుంబ సభ్యులే నడిపిస్తున్నారు. విద్యార్హతలు, ఆసక్తి ఉన్న యువత ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు లేక అవకాశాల కొరకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి పౌరసరఫరాలశాఖ అధికారులు బినామీల స్థానాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరముంది.


