● కొరమీను చేపల పెంపకంపై పలువురి ఆసక్తి ● రుణాల మంజూరుతో ప్రోత్సహిస్తున్నప్రభుత్వం ● నాగారంలో కొరమీను పెంచుతున్న ఓ యువరైతు
పాల్వంచరూరల్: చేపల్లో కొరమీను ఎంతో రుచిగా ఉంటుందో ధర కూడా అదేస్థాయిలో ఉంటుంది. అధిక పోషకాలు కూడా ఉండటంతో అమ్మకాలు కూడా జోరుగా సాగుతాయి. తద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని అధికారులు అవగాహన కల్పించడంతో పలువురు రైతులు కొరమీను పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)లో యూనిట్‌కు రూ.4.40 లక్షల చొప్పున డీఆర్‌డీఏ రుణం కూడా మంజూరు చేస్తోంది. దీంతో అశ్వాపురం, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో రైతులు కొరమీను పెంపకం చేపట్టారు.
నాలుగు నెలలు ట్యాంక్‌లో..
నాలుగు నుంచి ఆరు అంగులాలు కలిగిన 15 నుంచి 20 రోజుల కొరమీను చేప పిల్ల లను నర్సరీ ట్యాంక్‌లో నాలుగు నెలలపాటు పెంచుతారు. ఆ తర్వాత 200 నుంచి 400 చదరపు మీటర్లు కలిగిన పాండ్‌లోకి వదులుతారు. ఇలా 8 నెలలపాటు పెంచితే చేప కేజీ నుంచి రెండు కేజీల వరకు బరువుకు చేరుకుంటుంది. కాగా, కిలో ధర మార్కెట్‌లో రూ. 350 నుంచి రూ. 400 వరకు పలుకుతోంది.
నాగారంలో యువ రైతు ప్రయత్నం..
పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన నారకట్ల ఇసాక్ బీకాం చదువుకుని ఓ కంపెనీలో మార్కెటింగ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. మరో వైపు బ్యాంక్ రుణం రూ.4.19 లక్షలు తీసుకుని తనకు ఉన్న ఎకరం భూమిలో కొరమీను చేపలను పెంచుతున్నాడు. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు, తెలంగాణలోని సంగారెడ్డి నుంచి రూ.20 వేలతో 1000 పిల్లలను కొనుగోలు చేసి తెచ్చాడు. పెంపకం కోసం రూ.1.30 లక్షలతో ట్యాంక్ నిర్మాణం చేపట్టాడు. ఫీడింగ్ కోసం మరో రూ.1.26 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు. 900 పిల్లలు బతికాయని, ప్రస్తుతం కేజీ నుంచి కేజీన్నర సైజుకు ఎదిగాయని యువ రైతు తెలిపాడు. 9 క్వింటాళ్ల దిగుబడి వస్తే రూ. 3 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నాడు. గత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేపల పెంపకంపై అవగాహన కల్పించడంతో కొరమీను చేపల పెంపకం చేపట్టినట్లు ఇసాక్ తెలిపాడు.


