● కలెక్టర్ అంకిత్ ● సిబ్బందికి ప్రశంసా పత్రాలు పంపిణీ
పాల్వంచరూరల్: గిరిజన ప్రాంతాల్లో మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారని కలెక్టర్ అంకిత్ కితాబిచ్చారు. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఫంక్షన్ హాల్‌లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల సిబ్బంది 100 మందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేసి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులు, వైద్యులు, జిల్లాస్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా, సమన్వయంతో సేవలందిస్తుండటంతో రాష్ట్రస్థాయిలో అవార్డులు లభించాయన్నారు. డీసీహెచ్‌ఎస్ రవిబాబు, తహసీల్దార్ దారా ప్రసాద్, వైద్యులు ముక్కటేశ్వరరావు, సోమరాజ్‌దొర, సూపరింటెండెంట్లు రామకృష్ణ, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ సాయివర్ధన్, డాక్టర్ మౌనిక, డాక్టర్ గౌరిప్రసాద్ పాల్గొన్నారు.
సాదాబైనామా అర్జీలు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సాదాబైనామా, ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, ఇతర భూ సమస్యలపై శనివారం తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. సడలించిన నిబంధనల ఆధారంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పాల్వంచ, దమ్మపేట, కరకగూడెం తదితర మండలాల్లో ఉన్న అటవీ, రెవెన్యూ, ఇతర భూ సమస్యలకు సంబంధించిన సమగ్ర నివేదికలను అందజేయాలని ఆదేశించారు.
సామాజిక సమానత్వానికి
మార్గదర్శి పూలే
సామాజిక సమానత్వం, విద్యావ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతి రావు పూలే దేశానికి మార్గదర్శకుడిగా నిలి చారని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో పూలే జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. కలెక్టర్ తదితరులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పూలే మహిళా విద్యకు ప్రాధాన్యతమిచ్చారని, ముందుగా తన భార్యకు విద్య అందించి, మహిళల సాధికారతకు పునాది వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, బీసీ సంక్షేమ అధికారి విజ యలక్ష్మి, ఇతర అధికారులు దినేష్, ఉపేందర్, జి.శ్రీనివాస్, సుధీర్‌కుమార్, బీసీ సంఘం నాయకులు కొదుమూరు సత్యనారాయణ, బొర్రా జయమ్మ గుమలాపురం సత్యనారాయణ, జి కృష్ణ, ఇంద్రాల మురళి, వారాధి సత్యనారాయణ, బండి రాజుగౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


