ఆగని రేషన్‌ బియ్యం దందా | - | Sakshi
Sakshi News home page

ఆగని రేషన్‌ బియ్యం దందా

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో

తనిఖీలు

రెండు చోట్ల 482 క్వింటాళ్ల

బియ్యం స్వాధీనం

ఇల్లెందురూరల్‌/టేకులపల్లి: సివిల్‌ సప్లయీస్‌ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నా రేషన్‌ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. ఇల్లెందు మండలంలో కొన్నేళ్లుగా బియ్యం మాఫియా యథేచ్ఛగా తన వ్యాపారం సాగించగా.. అధికారులు పట్టుకున్నారు. అయినా అడ్డా మారుస్తూ దందా సాగిస్తున్నారని బయటపడింది. ఈ క్రమాన ఇల్లెందు రేపల్లెవాడలో అక్రమంగా నిల్వ చేసిన 200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని లారీ, బొలేరో వాహనాల్లో లోడ్‌ చేస్తుండగా జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి ప్రేంకుమార్‌, డీటీలు మహేశ్‌, ప్రభాకర్‌ శనివారం చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. ఈ క్రమాన నిందితులు వాహనాలను వదిలేసి పారిపోయారు. ఆపై రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని జీసీసీ గోదాముకు తరలించడమే కాక వాహనాలను పోలీసులకు అప్పగించారు. ఇక టేకులపల్లి మండలంలో కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు పట్టుకున్నారు. టేకులపల్లికి చెందిన లాలు, అక్షయ్‌ మండలంలో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి కారేపల్లి మండలానికి చెందిన బడా వ్యాపారి గౌతమ్‌కు అమ్మేవారు. ఆయన ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా జరిగేది. ఈ మేరకు శనివారం టేకులపల్లి మండలం బోరింగ్‌ తండా సమీపంలో లారీలో తరలిస్తున్న 282 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. బాధ్యులైన ముగ్గురిపై 6–ఏ, క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు డీసీఎస్‌ఓ తెలిపారు. తనిఖీల్లో కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం సివిల్‌ సప్లయీస్‌ డీటీలు మహేశ్‌, ప్రభాకర్‌, రాజు, ఆర్‌ఐలు వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.

అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. బియ్యం దందాపై ఆయన స్పందిస్తూ ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సివిల్‌ సప్లయీస్‌ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఇందులో 480 క్వింటాళ్లకు పైగా రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారని వివరించారు. సమగ్ర విచారణ అనంతరం నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement