బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి
● వ్యవసాయ మార్కెట్లలో రైతులకు వసతులు కరువు ● చెత్తాచెదారం, గత సీజన్ తాలుతో నిండిపోయిన యార్డులు ● ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా శుభ్రం చేయని వైనం
బూర్గంపాడు: వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఏటా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై రూ. కోట్ల ఆదాయం వస్తోంది. ఆ ఆదాయంలో కనీసం 5 శాతం కూడా వ్యవసాయ మార్కెట్ యార్డుల నిర్వహణకు ఖర్చు చేయడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంకాగా, కొన్ని మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే రైతులు తెచ్చిన ధాన్యం రాశులుగా పోసుకునేందుకు, ఆరబెట్టుకునేందుకు అనువైన పరిస్థితులు లేవు. యార్డులు చెత్తాచెదారంతో నిండిపోయాయి. చెత్త శుభ్రం చేసేందుకు కూడా తమ వద్ద నిధులు లేవని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులే శుభ్రం చేసుకుని వడ్లు పోసుకుంటున్నారు.
మార్కెటింగ్‌శాఖకు
రూ.22.65 కోట్ల ఆదాయం
జిల్లాలో బూర్గంపాడు, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, చర్ల, దమ్మపేటలలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటి పరిధిలో చెక్‌పోస్ట్‌లు, వ్యవసాయ గిడ్డంగులు, మార్కెట్ యార్డులు ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి మార్కెటింగ్‌శాఖకు రూ.22.65 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి నెలాఖరు వరకు సుమారు రూ. 19 కోట్లు సమకూరింది. మార్కెటింగ్ శాఖకు వచ్చిన ఆదాయం నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కనీస వసతులు కల్పించాల్సి ఉంది. రైతులకు తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు తీర్చాలి. యార్డుల్లో విద్యుత్ దీపాలు, డ్రెయినేజీ సిస్టం, పరిశుభ్రత, టార్ఫాలిన్ల పట్టాలు, సెక్యూరిటీ గార్డుల నియామకం వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులపై వచ్చిన ఆదాయంతో రైతులు భూములకు వెళ్లేందుకు పొలంబాటల అభివృద్ధి, పశు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాంలు నిర్మించాలి. అయితే మార్కెట్ కమిటీలు రైతుల వసతుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయటం లేదు. ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ఆదాయాన్ని స్థానిక యార్డుల అభివృద్ధికి కాకుండా ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తోందనే విమర్శలున్నాయి.
శుభ్రం చేయని గత సీజన్ చెత్తాచెదారం
బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌కు ప్రస్తుతం రైతులు ధాన్యం తీసుకొస్తున్నారు. యార్డులో ఎక్కడ చూసినా వానాకాలం సీజన్‌లోని ధాన్యం తూర్పార పట్టగా వచ్చిన తాలు, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా తయారైంది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా శుభ్రం చేయలేదు. యార్డులో కనీసం పది లారీల వరకు తాలు, చెత్తాచెదారం పేరుకుపోయి ఉంది. దీంతో రైతులే శుభ్రం చేసుకుంటున్నారు. యార్డులో విద్యుత్ లైట్లు సరిగా వెలగడంలేదు. పశువులు రాకుండా ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. మండుటెండల్లో యార్డుకు వస్తున్న రైతులకు కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. రైతుల విశ్రాంతి కోసం లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనంలో ఫ్యాన్లు, లైట్లు, టాయిలెట్లు సరిగా లేకపోవటంతో నిరుపయోగంగా మారాయి. రైతులు పండించిన పంటల క్రయవిక్రయాలపై మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్న మార్కెటింగ్ శాఖ.. రైతుల అవసరాల కోసం రూపాయి ఖర్చు చేయకపోవటాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.
ఆగస్టు నుంచి మార్కెట్ యార్డుకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్, వాటర్, యార్డు క్లీనింగ్ బిల్లులు రాకపోవడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. యార్డు క్లీనింగ్‌కు చర్యలు తీసుకుంటాం. రైతులకు కనీస అవసరాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తాం. – శారద,
స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, బూర్గంపాడు మార్కెట్


