ప్రారంభమైన భద్రాచల
రామాలయ అభివృద్ధి పనులు
నైవేద్య వంటశాలకు
తాత్కాలిక షెడ్ నిర్మాణం..
మరో రెండు రోజుల్లో
పూర్తిస్థాయి పనులు షురూ..
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గత నెల 27న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. 2027 మార్చి నాటికి పనులను పూర్తి చేసి అప్పగించాలని ఆదేశాలను జారీచేశారు. సమయం తక్కువగా ఉండటంతోపాటు గోదావరి పుష్కరాలు–2027 సైతం సమీపిస్తుండటంతో అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతమైంది. తొలుత ఆలయంలోని మొదటి ప్రాకారం నిర్మించేందుకు, ఉపాలయాలను తొలగింపునకు ప్రణాళికలు రచించారు. స్వామివారికి నివేదనను తయారుచేసే వంటశాల తాత్కాలికంగా షెడ్‌ను కొబ్బరికాయలకు కొట్టే ప్రదేశంలో శబరి విగ్రహం ఉన్న స్థలంలో నిర్మించనుండగా, శుక్రవారం పనులు ప్రారంభించారు. లడ్డూల తయారీ కేంద్రాన్ని సీఆర్వో కార్యాలయంపై భాగాన తానీషా కల్యాణ మండపానికి తరలించనున్నారు. ఇక చిత్రకూట మండపం, భద్ర మహర్షి ఆలయాన్ని సైతం తొలగించనున్నారు.
26న మూర్తులకు పూజలు
ఆలయ విస్తరణలో ఉపాలయాల తొలగింపు కీలకంగా మారింది. ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఆళ్వార్‌ల మూర్తులను తొలగించనున్నారు. లక్ష్మీతాయారు అమ్మవారి మూల మూర్తులను అంతరాలయంలో ఉంచి పూజలను జరపనున్నారు. ఆళ్వార్‌లు, చిత్రకూట మండపంలో ఉన్న స్వర్ణ పూత వాహనాలను, మూర్తులను రంగనాయకుల గుట్టపైన ఉన్న ధ్యానమందిరానికి తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి పనులన్నీ పూర్తి చేసి 26న అమ్మవారు, ఆళ్వార్ల మూర్తులకు పూజలు చేసి, కదిలించనున్నారు.
రూ.4 కోట్లతో భవనాల తొలగింపు
ఆలయ అభివృద్ధికి రూ.586 కోట్లను ప్రకటించగా, తొలి విడతగా రూ.351 కోట్లతో మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు భాగాలుగా పనులను విభజించగా, రూ.75కోట్లతో గోదావరి ఘాట్లు, రూ.180కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ. 96 కోట్లతో పరిసర ప్రాంతాల అభివృద్ధి చేపట్టనున్నారు. పనుల బాధ్యత అప్పగించిన ఆర్‌అండ్‌బీ శాఖ ఏక కాలంలో మూడింటి పనులను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది. తొలుత ఉపాలయాలు, చిత్రకూట మండపం, ఇతర భవనాల తొలగింపునకు సుమారు రూ. 4కోట్ల తో టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. మే మొదటి వారంలో పనులు ప్రారంభించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. రామాలయ అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


