డిజిటల్‌ సాంకేతికతతో సేవలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ సాంకేతికతతో సేవలు మెరుగు

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

● రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ● అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ

● రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ● అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): డిజిటల్‌ సాంకేతికతతో అంగన్‌వాడీ సేవలు మెరుగు పడతాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క) అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పోషణ్‌ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లను సందర్శించారు. అంగన్‌వాడీ సిబ్బంది తయారు చేసిన ఆహార పదార్థాలు, పిల్లలకు అర్థమయ్యే విధంగా రూపొందించిన విద్యా నమూనా లను పరిశీలించారు. అనంతరం భేటీ బచావో పథ కం కింద ఆడపిల్లల తల్లులకు హిమాలయ కిట్లను అందజేశారు. తొలుత మంత్రికి ఆదివాసీ సంప్రదాయమైన కొమ్ము నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిసీతక్క మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ల పంపిణీ ద్వారా అంగన్‌వాడీ సేవల నాణ్యత మెరుగుపడుతుందన్నారు. త్వరలోనే 15వేల అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి 12వేల భవనాలు మంజూరు చేశామని, మినీ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు వంటి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కిందఇప్పటివరకు సుమారు రూ. 8కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వేతనాల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపా రు. హైదరాబాద్‌లో 275 మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని అన్నారు.

మద్దుకూరులో కేరళ తరహా

అంగన్‌వాడీ కేంద్రం..

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మా ట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. చండ్రుగొండ మండలం మద్దుకూరులో కేరళ తరహాలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడు తూ జిల్లాలో 1,954మంది అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. డేటా సేకరణ, నివేదికల పంపిణీ, లబ్ధిదారుల వివరాల నిర్వహణ సులభతరం అవుతుందని చెప్పారు. జిల్లాలోని 2,061 అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు పూర్తిచేసి, రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ సిరిపురపు లలితకుమారి, అదనపు కలెక్టర్‌ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీడబ్ల్యూఓ స్వర్ణలత, ఇతర అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement