మొదలైన హడావుడి
బూత్ లెవల్ ఇన్‌చార్జిల నియామకంపై కాంగ్రెస్ దృష్టి
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల నియామకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఓటు బ్యాంక్‌ను కాపాడుకునే, కేడర్‌లో జోష్ నింపే పనిలో పడ్డాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి.
త్వరలో సర్ అమలు
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పొందిన ఓటరు గుర్తింపు కార్డు, ఒకటికి మించి ఉన్న ఓటరు కార్డులను తొలగిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో అమలు చేస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ–ఎన్డీఏకి అనుకూలంగా సర్ ప్రక్రియ సాగుతోందని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. సర్ జరుగుతున్న ప్రతీ చోట తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రెండు, మూడు నెలల్లో తెలంగాణలో కూడా సర్ అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
కీలకంగా బూత్ లెవల్ ఇన్‌చార్జిలు
జిల్లాస్థాయిలో సర్ అమలు బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ఓటర్ల నుంచి వివరాలు సేకరించడం, పరిశీలించడం, నకిలీ, డబుల్ ఓట్లను తొలగించడం, చివరకు తుది జాబితాను ప్రకటించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఓట్ల తొలగింపు సున్నితమైన వ్యవహారం కావడంతో సర్ అమలు చేసిన ప్రతీ చోట వివాదాలు ఏర్పడుతున్నాయి. తమ ఓట్లు అన్యాయంగా తొలగించారంటూ ఆరోపణలు చేసే వారి సంఖ్య పెరిగింది. దీంతో అభ్యంతరాల స్వీకరణకు బూత్ లెవల్ ఇన్‌చార్జిలు ఇచ్చే దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో బూత్ లెవల్ ఇన్‌చార్జిల నియామకం కీలకంగా మారింది.
రంగంలోకి కాంగ్రెస్
ఓ వైపు సర్ అమలవుతున్న తీరుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మరోవైపు సర్‌కు సన్నద్ధమవుతోంది. ప్రతికూల ప్రభావాలు తమ పార్టీపై పడకుండా కార్యాచరణ సిద్ధం చేసింది. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పోలింగ్ రోజున ఓటర్లను తరలించడం వంటి పనులు చేసే వారికి బూత్ లెవల్ ఇన్‌చార్జి పనిని రాజకీయ పార్టీలు అప్పగిస్తుంటాయి. కానీ, ఈసారి వీటికి తోడు ఓటు హక్కుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉన్నవారిని ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా బూత్ లెవల్‌లో చురుకై న కార్యకర్తలను గుర్తించేందుకు అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఇన్‌చార్జిలను ఇప్పటికే నియమించింది. సదరు ఇన్‌చార్జిలు నియోజకర్గాల వారీగా అక్కడున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో ఇప్పటికే సమావేశం అవుతున్నారు. సర్ ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బూత్ లెవల్ ఇన్‌చార్జిల ఎంపిక వంటి అంశాలపై చర్చలు మొదలు పెట్టారు. ఈ నెల 11లో ఇన్‌చార్జిలను ఎంపిక చేసి జాబితాను పీసీసీకి అప్పగించాల్సి ఉంది.
బూత్ లెవల్ ఇన్‌చార్జిల నియామకాలకు సంబంధించి కొత్తగూడెం, సత్తుపల్లికి ఇన్‌చార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, భద్రాచలం ఇన్‌చార్జిగా టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్‌ను నియమించారు. వీరు ఇప్పటికే తమ పని ప్రారంభించారు. ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలకు కూచన రవళీరెడ్డి, అశ్వారావుపేటకు సకలం రాజేశ్వరరావు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక జిల్లాకు చెందిన నాగా సీతారాములును ములుగు, నర్సంపేట అసెంబ్లీ నియోజకర్గాలకు, మోతుకూరి ధర్మారావును వర్ధన్నపేకు ఇన్‌చార్జిలుగా నియమించారు.
త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ


