కిన్నెరసానిని సందర్శించిన కమిషన్ బృందం..
● బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి ● బాలల హక్కుల పరిరక్షణపై ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సమీక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): అన్ని శాఖలు సమన్వయంతో బాలలకు సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, బాలల భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణ, మరుగుదొడ్ల వినియోగం, బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ కేసుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను కమిషన్ దృష్టికి తెస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ములకలపల్లి మండలం ధర్మన్న నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడం గమనించామని, అటవీశాఖ అనుమతుల సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అవసరమైతే కంటైనర్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల పిల్లల సమస్యల పరిష్కారానికి అంతర్రాష్ట్ర స్థాయిలో సమన్వయం అవసరమని తెలిపారు.
సమగ్ర చర్యలు..
బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. బాలసదన్ ద్వారా పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, 1098 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పిల్లల సమస్యలపై తక్షణ స్పందన అందిస్తున్నామని వివరించారు. అన్ని పాఠశాలల్లో పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 23 తరువాత బడిబాట కార్యక్రమం చేపట్టి మారుమూల ప్రాంతాల్లో డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తిస్తామని అన్నారు. సికిల్ సెల్ అనీమియా నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రక్షణ చర్యలు తీసుకుంటున్నాం
ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులను గుర్తించి, రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, కమిటీ మెంబర్లు కంచికచర్ల వందన గౌడ్, చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత, వచన్ కుమార్, భరత రాణి, సుమిత్ర దేవి, సాధిక్ పాష, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఖమ్మం డీడబ్ల్యూఓ వేల్పుల విజేత తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కె. సీతాదయాకర్‌రెడ్డి సందర్శించారు. డీర్ పార్కు, జలాశయాలను వీక్షించారు. రిజర్వాయర్‌లో బోటు షికారు చేశారు. చైర్మన్‌తోపాటు కమిషన్ సభ్యులు వందనగౌడ్, చందన్, అపర్ణ, సాధిక్‌పాషా, సుమతి, భారతరాణి ఉన్నారు.


