● 70 క్వింటాళ్లను గుర్తించిన పౌరసరఫరాల అధికారులు ● లక్ష్మీదేవిపల్లి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మాఫియా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సన్న బియ్యం అక్రమ వ్యాపారంలో మరో కీలకమైన తీగ పౌర సరఫరాల శాఖకు దొరికింది. ఇక్కడ నుంచి విచారణ ముమ్మరం చేస్తే దందా గుట్టు రట్టయ్యే అవకాశముంది. రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పౌర సరఫరాల శాఖ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సుజాతనగర్ మండలం అంజనాపురంలో రేషన్ డీలర్‌పై కేసు నమోదైంది. తాజాగా గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలో నిర్వహించిన దాడుల్లో అక్రమ నిల్వలు వెలుగు చూశాయి.
రూటుమార్చిన అక్రమార్కులు
సన్నబియ్యం అక్రమ రవాణాపై వరుసగా వార్తా కథనాలతో మాఫియా రూటు మార్చింది. నిన్నా మొన్నటి వరకు ఊరి మధ్యలో అనధికారిక గోదాంల్లో బియ్యం దాచి ఉంచేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చి ఊరికి దూరంగా చెట్ల పొదల్లో చిన్న చిన్న మూటలుగా నిల్వ ఉంచారు. అయితే సమాచారం అందడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి సుమారు 70 క్వింటాళ్లను స్వాధీనం చేసుకున్నారు. హేమచంద్రాపురం గ్రామంలో తనిఖీలు చేయగా ఓ ఇంట్లో బియ్యాన్ని తూచేందుకు ఉపయోగించే కాటాలు, మరో మూడు క్వింటాళ్ల వరకు బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచిన చక్రాల నరసింహరావుపై కేసు నమోదు చేసినట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అఽధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. పొదల్లో బియ్యం దాచిన వ్యక్తులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు.
దందాకు అడ్డుకట్ట ఎప్పుడు?
జిల్లా కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు సన్న బియ్యం అక్రమ దందాకు కేంద్ర బిందువులుగా వ్యవహరిస్తున్నారు. రోజూ వచ్చిన బియ్యం వచ్చినట్టుగా పక్కదారి పడుతుంటంతో పౌర సరఫరాల శాఖ అధికారులు నజర్ పెట్టారు. దందాలో కీలకంగా ఉన్న ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ‘ఖద్దరు’నేతల పేరు చెబుతూ, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని అధికారులు తమవైపు కన్నెత్తి చూడకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఓ వైపు దాడులు జరుగుతున్నా బియ్యం దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పుడు ఏకంగా క్వింటాళ్ల కొద్దీ బియ్యం లెక్కాపత్రం లేకుండా చెట్ల పొదల్లో లభించింది. ఇప్పటికై నా రేషన్ మాఫియాపై అధికారులు దృష్టి పెట్టాలనే డిమాండ్ అధికార పార్టీ నేతల నుంచే వస్తోంది. కొందరి స్వార్థంతో తమ పార్టీకి పేరు తీసుకురావాల్సిన పథకం నిర్వీర్యం అవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


