● కలెక్టర్ అంకిత్ ● యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన
కొత్తగూడెంఅర్బన్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఆయన కొత్తగూడెంలో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. లెవెలింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవనాల రూపకల్పన, కల్పించే సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎంఈఓకు షోకాజ్ నోటీస్..
పాతకొత్తగూడెంలో ఉన్న సమగ్ర శిక్ష పరిధిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయం, పట్టణ బాలుర ఆవాస విద్యాలయం (యూఆర్‌ఎస్ )లను గురువారం కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంగ్లిష్ పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. బోధనలో లోపాలను గుర్తించి, ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. స్టోర్‌రూమ్‌లో అవసరమైన సరుకులు లేకపోవడం, కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ వీధి బాలలు, రక్షిత బాలలు, డ్రాప్ అవుట్ బాలలు చదువుతున్నందున ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఎంఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాయి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


