నగరంలో జర్మనీ బృందం.. | - | Sakshi
Sakshi News home page

నగరంలో జర్మనీ బృందం..

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

● కార్పొరేషన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించిన ప్రతినిధులు ● టీఓడీ ప్రాజెక్ట్‌ ద్వారా రుణ మంజూరుకు అవకాశం

● కార్పొరేషన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించిన ప్రతినిధులు ● టీఓడీ ప్రాజెక్ట్‌ ద్వారా రుణ మంజూరుకు అవకాశం

కొత్తగూడెంఅర్బన్‌/పాల్వంచ: జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం కొత్తగూడెం కార్పొరేషన్‌లో పర్యటించారు. ట్రాన్సి ట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌ (టీఓడీ) ప్రాజెక్ట్‌ అమలులో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఆర్థికసాయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతినిధులు ఎస్‌.పరిమల్‌, ఎన్‌ఎన్‌రావు, రుచిఖరనాలతో పాటు ఢిల్లీకి చెందిన నితిన్‌ తదితరులు కొత్తగూడెం నుంచి పెద్దమ్మగుడి వరకు నగర తీరుతెన్నులు పరిశీలించారు. పాల్వంచలోని నటరాజ్‌ సెంటర్‌, అంబేద్కర్‌ సెంటర్‌, మున్సిపల్‌ స్టేడియం, కొత్తగూడెం ఫుడ్‌కోర్ట్‌ తదితర ప్రాంతాలను సందర్శించారు. తొలుత కార్పొరేషన్‌ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు అందుతున్న సర్వీసులు, ఆర్థిక వనరుల వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ అభివృద్ధికి కావాల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని మేయర్‌ మూడ్‌ గణేష్‌ కోరారు. కమిషనర్‌ సుజాత, అధికారులు పాల్గొన్నారు.

నగర అభివృద్ధికి నిధులు

నగర అభివృద్ధికి సుమారు రూ.300 కోట్లు వెచ్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రతినిధులు ప్రాజెక్ట్‌ పురోగతి, అమలు విధానం, మౌలిక వసతులు, అభివృద్ధిపై చర్చించి, అధికారులు సమగ్ర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రధాన రవాణా మార్గాలు, రైల్వే, బస్సు కారిడార్ల పరిసర ప్రాంతాలను అభివృద్ధి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నివాసాలు, ఉద్యోగాలు, వాణిజ్య కేంద్రాలు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్ట్‌లు, ఫుట్‌పాత్‌లు, రహదారుల అనుసంధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాజెక్ట్‌ బృందం రుణ ఆమోదం ఇస్తే నగరం అభివృద్ధి కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement