సూపర్‌బజార్(కొత్తగూడెం): ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు చేపట్టనున్న సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) పైపులైన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ క్వాలిటీ ఇన్‌చార్జి రామకృష్ణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పైపులైన్ రూట్ మ్యాప్, పనుల పురోగతి, సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. భూసేకరణ, అనుమతుల మంజూరు, రోడ్ల తవ్వకాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా 24 గంటల్లో అనుమతులు పొందే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, డిగ్ అండ్ రీస్టోర్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత నివారించేందుకు పీఎన్‌జీ సరఫరాను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు నోడల్ అధికారిగా జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్‌ను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మహేందర్, తిరుమలేష్, సుధీర్, మున్సిపల్ కమిషనర్లు, సీజీడీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


