ఒక్క యూనిట్ మించినా..
గతనెలలో 200 యూనిట్లు మించడంతో 3,328 మంది పథకానికి దూరం
విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని
అధికారుల సూచన
జిల్లావ్యాప్తంగా జీరో బిల్లు అందుతున్న లబ్ధిదారులు 1,77,430 మంది
విద్యుత్ పొదుపుగా వాడుకోవాలి..
భద్రాచలంఅర్బన్: జిల్లాలో వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఎండ వేడికి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లను సాధారణం కంటే ఎక్కవగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా గత నెలలో ఇప్పటివరకు 34.36 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించగా జనవరిలో 29.29 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఫిబ్రవరిలో 31.13 మిలియన్ యూనిట్లు వినియోగించారని అధికారులు చెబుతున్నారు. కాగా, గృహజ్యోతి పథకం కింద వినియోగదారులు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా పొందవచ్చు. 200 యూనిట్లు దాటితే బిల్లు పడుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
4,70,155 కనెక్షన్లకు రూ.5.74 కోట్ల బిల్లులు
జిల్లావ్యాప్తంగా 4,57,216 విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీరిలో కేవలం జీరో బిల్లులు వస్తున్న వారు 1,77,430 మంది ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.5.74కోట్లు, ఏడాదికి సుమా రు రూ.68.88 కోట్లు చెల్లిస్తోంది. కాగా ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రూ.139 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యుత్ శాఖకు చెల్లించింది.
1,77,430 మందికి లబ్ధి
జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగదారులు 1,81,386 మంది ఉండగా ప్రభుత్వం జీరోబిల్లు అమలు చేసిన నాటి నుంచి 1,77,430 మంది పథకానికి అర్హులయ్యారు. ఇప్పటికే మార్చిలో ఎండలు దంచికొట్టగా, ఏప్రిల్, మేలో వచ్చే ఎండలకు విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో జీరో బిల్లు వచ్చే పరిస్థితి ఉండదు. విద్యుత్ వినియోగించే వారి సంఖ్య మరింత పెరగనుందని అధికారులు చెబుతున్నారు. 200 యూనిట్లు దాటిన వారంతా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మార్చిలో 3328 మంది పథకానికి దూరం..
జిల్లావ్యాప్తంగా 1,77,430మంది వరకు గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరిలో వినియోగమైన విద్యుత్‌ను మార్చిలో రీడింగ్ తీయగా.. 3,328 మంది లబ్ధిదారులు ఉచిత విద్యుత్ పథకానికి దూరమయ్యారు. దీంతో వారు ఫిబ్రవరి బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతేడాది మార్చిలో 3,923 మంది, ఏప్రిల్‌లో 12,600 మంది, మేలో 15,912 మంది లబ్ధిదారులు పథకానికి దూరమయ్యారు. వచ్చే జూన్ నుంచి వాతావరణం మారి వర్షాలు కురిస్తే విద్యుత్ వినియోగం 200యూనిట్ల పరిధిలోకి వచ్చి పథకానికి అర్హులవుతారు.
ఉచిత విద్యుత్ 200 యూనిట్లకే పరిమితం. ఒక్క యూనిట్ దాటినా యూనిట్‌కు రూ.5.10 చొప్పున బిల్లు పడుతుంది. 201 యూనిట్లు నమోదైతే ఇతర చార్జీలతో కలిపి కనీస బిల్లు రూ.1,050 చెల్లించాల్సి ఉంటుంది.
పరిమితికి మించి విద్యుత్
వినియోగంతో నష్టం
ఎండలు మండుతుండంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రతీ వినియోగదారుడు పొదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. 200 యూనిట్లు దాటితే వినియోగదారులు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వృథాను అరికట్టి సంస్థ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. అవసరమైన సమయంలోనే కరెంటు వాడాలి.
– జీవన్‌కుమార్, డీఈ, భద్రాచలం


