క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

ఖమ్మంక్రైం: పోలీసులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వం సొంతమవుతుందని ఖమ్మం పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. ఖమ్మం సిటీ ఆర్మ్‌డ్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆవరణలో ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్మించిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు షటిల్‌ ఆడిన సీపీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది, కుటుంబాలు కాంప్లెక్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తలసేమియా నిర్మూలనే లక్ష్యం

ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా రహిత సమాజ నిర్మాణానికి అంతా కలిసి రావాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు పిలుపునిచ్చారు. వచ్చేనెల 8న ప్రపంచ తలసేమియా దినోత్సవం జరుపుకోనుండగా, నెల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు బుధవారం ఖమ్మంలోని రితన్య ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని సీఎస్‌బీ ఏసీపీ టి.మహేష్‌, సీఏఆర్‌ ఏసీపీ నరసయ్య, సీసీఎస్‌ ఏసీపీ సర్వర్‌, సీఎస్‌బీ సీఐ రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహం విద్యార్థులు రక్తదానం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడు తూ సంకల్ప సంస్థకు అండగా నిలిచేలా చిన్నారులకు అవసరమైన సమయాల్లో రక్తదానం చేస్తామని తెలిపారు. ఆతర్వాత డాక్టర్‌ డి.నారాయణమూర్తి, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి రవిచందర్‌ మాట్లాడగా ఏసీపీ టి.మహేష్‌, సీఐ రాజిరెడ్డి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

అశ్వారావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడేనికి చెందిన రజని సాయిరాం ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం అనంతారం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రామన్నగూడెం శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సారియారంను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement