అమీర్‌పేట: రూ.3.50కోట్లు చెల్లించి ఇంటిని కొనుగోలు చేశాడు... గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం సారపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (42) స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల వనస్థలిపురంలో రూ.3.50 కోట్లతో ఇల్లు కొనుగొలు చేశాడు. గృహప్రవేశం కోసం ఈ నెల 2న భార్య అనూష, కూతురుతో కలిసి నగరానికి వచ్చి నిజాంపేటలోని బావమరిది ఇంట్లో దిగారు. శుక్రవారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ప్రవీణ్‌రెడ్డి తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్ చేస్తే సమయం పడుతుందని తెలిపాడు. అర్ధరాత్రి 12 గంటల సమయాన మరోసారి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అంతకుముందు భార్యకు పంపిన లొకేషన్ ఆధారంగా వెతుక్కుంటూ అమీర్‌పేట రాగా, రెనెక్సా అపార్ట్‌మెంట్ సమీపాన ఫుట్‌పాత్‌పై చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు అమ్మిన వ్యక్తులు నకిలీ పత్రాలతో తనను మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. ఘటనపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ పత్రాలతో నమ్మించారని సూసైడ్‌నోట్


