భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ అంకిత్ అన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కమిషనర్ హన్మంతరావుతో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దష్టి సారించిందని, ఈనెల 27న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని తెలిపారు. 25వ తేదీ నాటికి శిలాఫలకం ఏర్పాట్లు, సీఎం పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ.. నవమి, పట్టాభిషేకం, భూమి పూజ కార్యక్రమాల విజయవంతానికి అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ముందస్తు ఏర్పాట్లు చేయాలి
సీతారాముల కల్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మిథిలా స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్టార్లలో విధులు నిర్వర్తించే అధికారులు 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు సబ్ కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాలన్నారు. శ్రీరామనవమికి సీఎం, పట్టాభిషేకానికి గవర్నర్ హాజరు కానున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. అనంతరం గిరి మార్ట్‌ను సందర్శించి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసిన గిరిజన రైతులు, మహిళలు, స్వయం సహాయక గ్రూపుల వారు వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇదో గొప్ప అవకాశమని, నాణ్యమైన వస్తువులతో వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఎస్పీ రోహిత్‌రాజ్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, సీపీఓ సంజీవరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఈ రవీందర్, జీపీ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు ఆధునిక పద్ధతులతో సాగు చేస్తూ అధిక దిగుబడి సాధించాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు శాసీ్త్రయ, ఆధునిక పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఆధునిక విధానాల ద్వారా ఖర్చు తగ్గిస్తూ దిగుబడి పెంచుకోవచ్చని సూచించారు. కేవీకే అందిస్తున్న శిక్షణలు, శాస్త్రవేత్తల సలహాలు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, డీఏఓ బాబూరావు, ఉద్యాన, మత్స్య శాఖల అధికారులు కిషోర్, ఇంతియాజ్ ఖాన్, త్రీ ఇంకై ్లన్ సర్పంచ్ ఈసం ప్రవళ్లిక, కేవీకే కోఆర్డినేటర్ భరత్, ఆత్మ చైర్మన్లు వీరభద్ర రావు, బుచ్చిబాబు, బోడా మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని సింగరేణి, సెయింట్‌మేరీస్, బాబూక్యాంప్‌లోని పీఎంశ్రీ హైస్కూళ్లలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు కలెక్టర్ అంకిత్ సోమవారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించాలని, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఇవ్వొద్దని నిర్వాహకులను ఆదేశించారు.
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని సూచించారు.
కలెక్టర్ అంకిత్ వెల్లడి


