రేషన్‌.. అయోమయం! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌.. అయోమయం!

Mar 7 2026 8:09 AM | Updated on Mar 7 2026 8:09 AM

● నిర్దేశిత గడువు లేకుండా బియ్యం పంపిణీ ● ఒక్కో నెలలో ఒక్కో తేదీ వరకు ఇస్తున్న డీలర్లు ● స్పష్టతలేక బియ్యం తీసుకోలేకపోతున్న లబ్ధిదారులు ● షాపుల నిర్వహణలో కొరవడుతున్న సమయపాలన చర్యలు తీసుకుంటాం

జిల్లాలో రేషన్‌కార్డులు, బియ్యం పంపిణీ వివరాలు..

● నిర్దేశిత గడువు లేకుండా బియ్యం పంపిణీ ● ఒక్కో నెలలో ఒక్కో తేదీ వరకు ఇస్తున్న డీలర్లు ● స్పష్టతలేక బియ్యం తీసుకోలేకపోతున్న లబ్ధిదారులు ● షాపుల నిర్వహణలో కొరవడుతున్న సమయపాలన

కొత్తగూడెంఅర్బన్‌: రేషన్‌ బియ్యం పంపిణీలో నిర్దేశిత తేదీలు, సమయం లేకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు బియ్యం తీసుకోలేకపోతున్నారు. గతంలో ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డీలర్లు రేషన్‌ బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం 1వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభిస్తున్నా.. ఒక నెల 20వ తేదీ వరకు, మరో నెల 15వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు. దీంతో 15వ తేదీ తర్వాత వెళ్లిన లబ్ధిదారులకు బియ్యం అందడంలేదు. పంపిణీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేస్తారనేది డీలర్లు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల వద్ద కూడా ఈ విషయంపై స్పష్టత లేదు. ఎప్పటివరకు బియ్యం పంపిణీ చేయాలనే విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయిస్తారని, ఆ ప్రకారమే పంపిణీ చేస్తున్నామని డీలర్లు చెబుతున్నారు. నిర్దేశిత కట్‌ ఆఫ్‌ తేదీ లేకపోవడంతో తాము కూడా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా రేషన్‌ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతుంటారు. ఎక్కువ మంది లబ్ధిదారులు రేషన్‌ తీసుకోవడంతో ఆ తర్వాత షాపులకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుంది. కానీ కొద్ది నెలలుగా 15, 16, 17 తేదీల్లో ఎప్పుడు బంద్‌ చేస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్లకు వెళ్లినవారు, ఇతర అత్యవసర పనులు ఉన్నవారు రేషన్‌ షాపులకు వస్తే ఈ నెల కోటా పూర్తయిందని డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు చేపట్టి రేషన్‌ బియ్యం పంపిణీకి కట్‌ ఆఫ్‌ డేట్‌ నిర్ణయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. గోదాం నుంచి రేషన్‌షాపునకు బియ్యం రావడం ఆలస్యమైతే మాత్రం గడువు పెంచుతున్నారని చెబుతున్నారు.

సమయపాలన పాటించని డీలర్లు

జిల్లా పౌరసరఫరాల అధికారుల పర్యవేక్షణ, పరిశీలనలు లేకపోవడంతో డీలర్లు సమయపాలన పాటించడం లేదు. రేషన్‌షాపులు తెరిచే సమయం లబ్ధిదారులకు తెలిపి, ఆయా సమయాల్లోనే బియ్యం అందించాలని అధికారులు చెబుతుంటే, రేషన్‌ డీలర్లు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌షాపులు ఎప్పుడు తెరుస్తారోనని కొందరు షాపుల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డీలర్లు తమకు అనుకూలమైన సమయంలో షాపులు తెరుస్తున్నారని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. షాపులు తెరిచేందుకు కచ్చితమైన సమయం, తేదీలు నిర్ణయించాలని అధికారులను కోరుతున్నారు.

జిల్లాలోని రేషన్‌ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం. కట్‌ ఆఫ్‌ తేదీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తారు. రేషన్‌షాపులు తెరిచే సమయాలను ప్రజలకు తెలియజేసి, ఆ సమయానుసారంగా తెరిచి లబ్ధిదారులకు బియ్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. – ప్రేమ్‌కుమార్‌,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

రేషన్‌షాపులు 443

ఆహార భద్రత 2,92,196

అంత్యోదయ 21,148

అన్నపూర్ణ 03

మొత్తం కార్డులు 2,93,263

ప్రతీనెల బియ్య 5,384.762 మెట్రిక్‌ టన్నులు

Advertisement
 
Advertisement
Advertisement