సర్వేలో ఆడపులులు ! | - | Sakshi
Sakshi News home page

సర్వేలో ఆడపులులు !

Feb 3 2026 7:27 AM | Updated on Feb 3 2026 7:27 AM

సర్వే

సర్వేలో ఆడపులులు !

● వన్యప్రాణుల గణనలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు ● ఉద్యోగులే కాక వలంటీర్లలోనూ అతివలు ● దట్టమైన అడవిలో వెన్నుచూపకుండా విధులు విధి నిర్వహణే లక్ష్యం చిరుతల జాడ గుర్తించాం.. భవిష్యత్‌కు దోహదం

● వన్యప్రాణుల గణనలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు ● ఉద్యోగులే కాక వలంటీర్లలోనూ అతివలు ● దట్టమైన అడవిలో వెన్నుచూపకుండా విధులు

ఖమ్మంవ్యవసాయం: వన్యప్రాణుల గణనలో మహిళలు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. వంటింటికే పరిమితమైన రోజుల నుంచి పురుషులకు తగ్గకుండా అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ వెన్నుచూపక విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనేపథ్యాన జనవరి 19 నుంచి నిర్వహించిన పులులు, వన్యప్రాణుల గణనలో అటవీ శాఖ పరిధిలోని మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. శాఖలోని వివిధ హోదాల ఉద్యోగులే కాక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, వలంటీర్లు కూడా పాల్గొన్నారు. గణనలో దాదాపు సగం మంది మహిళా ఉద్యోగులు, వలంటీర్లు ఉండడం విశేషం.

40శాతానికి పైగా మహిళలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా 4,311 చదరపు కిలో మీటర్ల అటవీ విస్తీర్ణం ఉండగా, ఖమ్మం జిల్లాలో 637 చదరపు కిలో మీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వన్యప్రాణుల గణన ప్రక్రియలో మొత్తం 1,105 మంది పాల్గొన్నారు. వీరిలో అటవీ ఉద్యోగులతోపాటు వలంటీర్లు 262 మంది ఉన్నారు. వీరిలో 40 నుంచి 50 శాతం మంది మహిళలు ఉన్నారు. కేటాయించిన అటవీ బీట్లలో ఉంటూ సర్వే నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మాంసాహార, శాఖాహార జంతువులతోపాటు, చెట్లు, పొదలు, మొక్కలు, ఆవాసాలను లెక్కించారు. చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, అడవి పందులు, రేసు కుక్కలు, కనుజులు, మనుబోతులు, నక్కలు, దుప్పులు తదితర జంతువుల సంచారం ఉన్నట్లు పాదముద్రలు, వెంట్రుకలు, అవశేషాలు, విసర్జితాలు, గోర్ల ఆధారంగా గుర్తించారు. జంతువులు సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకు సంచరిస్తుంటాయి. ఆ సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని దట్టమైన అడవుల్లో నిబంధనల ప్రకారం ఒక్కో అటవీ బీట్‌లో ఇద్దరు, ముగ్గురు చొప్పున వన్యమృగాల గణన చేశారు. ఉమ్మడి జిల్లాలో అటవీ మహిళా అధికారులతోపాటు మహిళా వలంటీర్లు సర్వేలో శివంగులుగా పనిచేసి అటవీశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.

వన్యప్రాణుల గణనలో రిస్క్‌ ఉంటుంది. మహిళలకు మరింత ఇబ్బంది అని తెలిసినా విధి నిర్వహణే లక్ష్యంగా సర్వే చేశాం. పులుల కదలికల గుర్తింపులో శిక్షణ తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురుకాలేదు. వాచర్‌ వెంట రాగా ఉదయం 6గంటలకే వెళ్లేవాళ్లం. ఆసక్తితో శాఖలో చేరిన నాకు సర్వే ఎంతో నేర్పింది. – బానోత్‌ గౌతమి,

బీట్‌ ఆఫీసర్‌, కొంపెల్లి, సత్తుపల్లి

ఉదయం 6 గంటలకు క్షేత్రస్థాయికి చేరుకుని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రణాళికతో పనిచేశాం. చిరుతల జాడలు లభించాయి. ఔషధ మొక్కలూ గుర్తించాం. సాధారణ విధులతో పోలిస్తే సర్వేను ఓ టాస్క్‌గా చేశాం. అడవిలో విధులు నిర్వర్తించడం ఆహ్లాదంగా గడిచింది.

– పూనెం లావణ్య,

బీట్‌ ఆఫీసర్‌, పులిగుండాల

మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ చదివి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నా. వన్యప్రాణుల గణనలో వలంటీర్‌గా అవకాశం వచ్చింది. వెలుగుమట్ల అటవీ ప్రాంతంలో సర్వే సమయాన తొలిరోజు భయం వేసినా ధైర్యంగా ముందుకు సాగాం. ఇది భవిష్యత్‌లో నాకు ఉపయోగపడుతుంది.

– జలగం కవిత,

వలంటీర్‌, బొడ్లాడ, మహబూబాబాద్‌ జిల్లా

సర్వేలో ఆడపులులు !1
1/4

సర్వేలో ఆడపులులు !

సర్వేలో ఆడపులులు !2
2/4

సర్వేలో ఆడపులులు !

సర్వేలో ఆడపులులు !3
3/4

సర్వేలో ఆడపులులు !

సర్వేలో ఆడపులులు !4
4/4

సర్వేలో ఆడపులులు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement