● చెక్‌పవర్ మున్సిపల్ కమిషనర్లదే..
సత్తుపల్లిటౌన్: మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు విధులు, బాధ్యతలు ఎంత కీలకంగా ఉంటాయో, అదే రీతిలో కమిషనర్‌కు కూడా అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. మున్సిపాలిటీల్లో చెక్‌పవర్ కమిషనర్‌కు మాత్రమే వర్తిస్తుంది. వ్యక్తులు లేదా సంస్థలకు చెక్కులు ఇవ్వాలంటే ఎందుకు చెల్లింపులు జరపాలనే విషయం ముందుగా గుర్తించాలి. ఏదైనా పురపాలికలో రూ.లక్షతో సామగ్రి కొనుగోలు లేదా అభివృద్ధి పనులు చేపట్టిన బిల్లులను సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి కమిషనర్‌కు సమర్పించాలి. కమిషనర్ వివరాలను సరి చూసుకుని ధ్రువీకరిస్తూ కౌన్సిల్ అనుమతి పొందాలి. ఫైల్‌పై మున్సిపల్ చైర్‌పర్సన్ సంతకం తీసుకోవాలి. అనంతరం వివరాలు క్యాష్ బుక్‌లో నమోదు చేశాక కమిషనర్ చెక్కు జారీ చేస్తారు. చెక్కు ఏ వ్యక్తికి, ఎందుకు ఇస్తున్నారనే వివరాలను క్యాష్‌బుక్‌లో నమోదు చేసే బాధ్యతను కమిషనర్, అకౌంటెంట్ చూసుకోవాలి. పాలకవర్గ గడువు ముగిస్తే ప్రత్యేకాధికారి అనుమతితో చెక్కులు జారీ చేస్తారు. ఏ నిబంధన ఉల్లంఘించినా నేరంగా పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ బిల్లులు, తప్పుడు సమాచారంతో చెక్కులు జారీ చేస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతోపాటు క్రిమినల్ కేసులు పెట్టి సొమ్ము రికవరీ చేసే అవకాశం ఉంటుంది.


