సామాజిక బాధ్యతగా..
సివిల్స్ అభ్యర్థులకు ఆర్థికసాయం
ప్రభావిత ప్రాంతాల్లో
మౌలిక వసతుల కల్పన
విద్యాసంస్థలు, గ్రంథాలయాల్లో ఫర్నిచర్, పరికరాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో
రూ.156 కోట్లు కేటాయింపు
బొగ్గు, సౌర విద్యుత్ ఉత్పత్తితో ముందుకు సాగుతున్న సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులు వెచ్చిస్తోంది. మూడేళ్ల నికర లాభాల నుంచి రెండు శాతం చొప్పున కేటాయిస్తోంది. వీధి లైట్లు ఏర్పాటు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, విద్యాసంస్థలు, గ్రంథాలయాల్లో వసతుల కల్పన వంటి పనులు చేపడుతోంది. చెరువుల పూడికతీత తదితర పనులు చేపడుతూ గ్రామీణాభివృద్ధికి కూడా కృషి చేస్తోంది. –కొత్తగూడెంఅర్బన్
కలెక్టర్ల సూచనలతో సీఎస్సార్ నిధులతో చేపట్టే పనులు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. సివిల్స్ రాస్తున్న అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్ అభయ హస్తం పథకం ద్వారా ఆర్థికసాయం అందజేస్తున్నాం. సింగరేణి, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నాం. – కిరణ్‌కుమార్,
జీఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్సార్ విభాగం
2025–26 ఆర్థిక సంవత్సరంలో సీఎస్సార్ ఫండ్ రూ.156 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రానున్న మూడేళ్లలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకొని, ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దరఖాస్తులు స్వీకరించి, ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నిధులు కేటయిస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపడుతోంది. టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, తేనెటీగల పెంపకంపై మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఏర్పాటు చేస్తోంది.
జీవనోపాధి మెరుగు, ఆర్థికాభివృద్ధి..
2014–15 ఆర్థిక సంవత్సర నుంచి 2023–24 వరకు సీఎస్సార్ నిధులతో చేపట్టిన పనుల వివరాలను అధికారులు సింగరేణి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 2024–25 నిధులతో ఇంకా పనులు జరుగుతున్నాయని, 2025–26 సంవత్సరానికి సంబంధించిన నిధుల కేటాయింపు జరిగిందని అధికారులు తెలిపారు. సీఎస్సార్ పాలసీ కింద సింగరేణి, ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, స్థానికుల జీవనోపాధి మెరుగుపర్చడం, ఆర్థిక అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితులలో మద్దతు, కంపెనీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాలు చేపడుతున్నారు. నిధుల్లో 80 శాతం సింగరేణి ప్రాంతాల్లో, 20 శాతం ఇతర ప్రాంతాల్లో వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రెండేళ్లలోపే పూర్తి..
సీఎస్సార్ నిధులతో చేపట్టే ప్రాజెక్టులు రెండేళ్ల కాల పరిమితితో పూర్తిచేయాలని, మూడేళ్ల కంటే ఎక్కువ వ్యవధి ఉన్న ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదనే మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తు తం సింగరేణిలో మెడికల్‌బోర్డు సమావేశాలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీంతో నిరుద్యోగులుగా ఉంటున్న కార్మిక కుటుంబాల వారసులకు సీఎస్సా ర్ నిధులతో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.
రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ సివిల్ అభయ హస్తం పథకం ప్రవేశపెట్టగా, సింగరేణి సంస్థ నిధులు సమకూర్చుతోంది. సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన రాష్ట్రంలోని అభ్యర్థులకు ఆర్థికసాయం అందిస్తోంది. గతేడాది ఇందుకోసం రూ.1.60 కోట్లు వెచ్చించింది. ఈసారి ప్రిలిమ్స్ అర్హత సాధించిన 202 మందికి రూ. 2.02 కోట్లను అందించింది. వారిలో 50 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారికి మళ్లీ రూ. లక్ష చొప్పున రూ. 50లక్షలు అందజేసింది. అభ్యర్థులకు ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సింగరేణి ఆర్థికసాయం అందుకున్నవారిలో ఒకరు గతేడాది ఆలిండియా ఏడో ర్యాంకు సాధించి ప్రతిభ చూపారు.
సింగరేణి సీఎస్సార్ నిధులతో అభివృద్ధి పనులు
సామాజిక బాధ్యతగా..
సామాజిక బాధ్యతగా..


