సంగీత సాగరంలో ఓలలాడిన భద్రగిరి
● రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం ● భక్తి గీతాలను ఆలపించిన కళాకారులు
భద్రాచలం: తక్కువేమి మనకు..రాముడొక్కడుండు వరకు.., అదిగో భద్రాద్రి ఇదిగో.. గౌతమి చూడండి.., పలుకే బంగారమాయెనా...కోదండ పాణి అంటూ సంగీత కళాకారులు ఆలపించిన కీర్తనలతో భద్రగిరి సంగీత సాగరంలో ఓలలాడింది. భద్రగిరి రామయ్య దాసుడు, ప్రముఖ వాగ్గేయకారుడు, దాశరథి శతక కర్త, భద్రాచల దేవస్థాన ఆలయ నిర్మాత భక్త రామదాసు 393 జయంతి ఉత్సవాలు శుక్రవారం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. రామదాసుకు భక్తజనం, సంగీత కళాకారులు నీరాజనం పలికారు. దేవస్థానం, చక్ర సిమెంట్స్ వారి నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్, నామగాన లహరి కల్చ రల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఐదురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి.
రామనామం విశ్వవ్యాప్తం కావాలి
శ్రీరామనామం విశ్వవ్యాప్తం కావాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. తొలుత ఆల య ప్రాంగణంలోని ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న రామదాసు విగ్రహానికి పంచామృతంతో అభిషేకం జరిపారు. ఫల, పుష్పాలను, నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం రామదాసు చిత్రపటంతో ఆలయ ఈఓ దామోదర్‌రావు తోడుగా ఆస్థాన విద్వాంసులు, అర్చకులు నగర సంకీర్తనగా భద్రగిరి ప్రదక్షిణ చేశారు. ఉత్తర ద్వారం వద్దనున్న భక్త రామదాసు విగ్రహానికి పూలమాలలు వేశారు. భద్రగిరి ప్రదక్షిణ అనంతరం పవిత్ర గోదావరి వద్దకు వెళ్లి గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలను సమర్పించారు. గోదావరి తల్లి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా తీసుకొచ్చి చిత్రకూట మండపంలో వేదికపై కొలువుదీర్చారు. ఎమ్మెల్యే, ఈఓ, చక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్‌లు జ్యోతిప్రజ్వలన చేసి సంగీత కార్యక్రమాలను ప్రారంభించారు.
నవరత్న కీర్తనలతో..
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు, కళాకారుల నవరత్న కీర్తనలను ఆలపించారు. రామదాసు కీర్తనలతో చిత్రకూట మండపంలో భక్తి పారవశ్యం నెలకొంది. నేండ్రగంటి కృష్ణమోహన్, ఎమ్మెల్యే వెంకట్రావ్ సైతం స్వరఅర్చనలో జత కలిశారు. సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు, అతని కుమారులు మల్లాది శ్రీరామ్‌కుమార్, రవికుమార్‌ల సంగీత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కంచర్ల గోపన్న వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్, స్థానాచార్యులు స్థలశాయి, ప్రధాన అర్చకుడు విజయరాఘవన్ పాల్గొన్నారు.
సంగీత సాగరంలో ఓలలాడిన భద్రగిరి


