అటవీ భూముల జోలికొస్తే సహించం
చుంచుపల్లి: జాతరల పేరుతో అటవీ భూముల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంజారా సంఘాలు జేఏసీ పేరుతో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు శ్రీశ్రీశ్రీ సాతి భవాని మహా జాతరను రేగళ్ల క్రాస్ రోడ్డు చాతకొండ నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నిర్వహించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గోడపత్రికల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నా రని తెలిపారు. కలెక్టర్, పోలీసు శాఖ, అటవీ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండానే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. జాతర జరుపబోయే ప్రదే శం చాతకొండ నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అని, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యానికి చెందిన ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉందని, ఇక్కడ ఎవరికీ అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎవరైనా అనధికారికంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినా, అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించినా తెలంగాణ అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో వైపు అటవీశాఖ సూచనలతో చాతకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని సర్వే నంబర్లు 17, 50లలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. కొత్తగూడెం ఎఫ్‌డీఓ యూ.కోటేశ్వరరావు, డీఆర్‌ఓ తోలెం వెంకటేశ్వరరావు ఉన్నారు.
డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్


