రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో 4న చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 4న చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకో వాలని, వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
సీఎం పర్యటన
ఎన్నికల కోడ్‌కు విరుద్ధం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా
మణుగూరు రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిధులతో చేపట్టే కార్యక్రమాలకు హాజరుకావడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమేనని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం పర్యటనకు ఎన్నికల అధికారులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను పెద్ద ఎత్తున సభలకు తరలిస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజా రవాణాను ఆపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందనే ఆందోళనలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన
చుంచుపలి : ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ తుకారంరాథోడ్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, హెపటైటిస్–బీ, హెపటైటిస్–సీ రక్తం ద్వారా వ్యాపించే వ్యాధులేనన్నారు. యువతలో డ్రగ్స్ వాడకం పెరగడం ఆందోళన కలిగిస్తోందని, వివా హానికి ముందు జాతకాలు కాదని, హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. హెచ్‌ఐవీ సోకి చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రాజమల్లు, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజస్విని, డాక్టర్ సైదులు, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లక్కినేని సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడి కృషి అభినందనీయం
భద్రాచలం: ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను తీర్చిదిద్దడంలో ఎస్‌టీజీ కారం గాంధీ చూపిన శ్రద్ధ ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శనీయమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. దుమ్ముగూడెం మండలం కె.గంగోలు జీపీఎస్‌ను ఇటీవల తనిఖీ చేసిన పీఓ.. విద్యార్థులను పలు ప్రశ్నలు అడగగా వారు తడుముకోకుండా సమాధానాలు చెప్పారు. దీంతో అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు కారం గాంధీని సోమవారం తన చాంబర్‌లో పీఓ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఏడాది క్రితం విధుల్లో చేరిన గాంధీ.. అక్కడున్న 15 మంది విద్యార్థులను బాగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఇతర ఉపాధ్యాయులు సైతం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉపాధ్యాయులకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గ్రీటింగ్ లెటర్ అందించి ప్రత్యేకంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీడీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ


