తేమతోనే కొర్రీలు
పంటల అమ్మకాల్లో అదే పెద్ద సమస్య
ప్రమాణాల మేరకు ఉంటేనే కొనుగోళ్లు
రైతులకు అందుబాటులో లేని యంత్రాలు
పత్తి, ధాన్యం విక్రయాల్లో తప్పని తిప్పలు
మద్దతు ధర దక్కక నష్టపోతున్న వైనం
తేమ కొలవలేమా.. ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆరుగాలం కష్టించి రైతులు వ్యవసాయం చేస్తుండగా.. పంటలు అమ్ముకునే సమయంలో సరైన అవగాహన లేక ప్రతీసారి నష్టపోతున్నారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో అటు రైతు వేదికల ఇన్‌చార్జ్‌లు, ఇటు వ్యవసాయ అధికారులు నామ్‌కే వాస్తేగా మారుతున్నారే తప్ప వారికి ఎలాంటి సాయం చేయడం లేదు. దీంతో మద్దతు ధరలో సగానికి సగం రైతుల ఖాతాల్లో కాకుండా దళారుల జేబుల్లోకి చేరుతోంది.
12 శాతానికి మించితే..
పత్తి కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. అమ్మకానికి తెచ్చిన పత్తిలో 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తోంది. 8 శాతం తేమ ఉంటే క్వింటా పత్తికి గరిష్టంగా రూ.8,100 చెల్లిస్తుండగా.. 12 శాతం ఉన్న పత్తికి కనిష్టంగా రూ.7,689 మద్దతు ధరగా నిర్ణయించింది. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలుకు నిరాకరిస్తోంది. లేదా గంటల తరబడి వేచి చూసిన తర్వాత ‘ప్రత్యేక పరిస్థితి’లో ఆ పత్తి అమ్ముడవుతోంది. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తికి ఫంగస్ సోకి, త్వరగా నల్లబడుతుంది. అంతేకాదు.. పక్కనున్న నాణ్యమైన పత్తిని సైతం పాడు చేసే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల దగ్గర 12 శాతానికి మించి తేమ ఉంటే అమ్మడం రైతుకు కత్తి మీద సామవుతోంది.
అక్కడ తేమ చిక్కుల్లేవ్..
సీసీఐ కొనుగోలు కేంద్రాలకు సమాంతరంగా జిల్లాలోని ప్రతీ మండల కేంద్రం, కీలకమైన కూడళ్లలో ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ఇక్కడ తేమ, గీమా అంటూ రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టరు.. తేమ కొలిచే పరికరాలతో పరీక్షలూ చేయరు.. కంటి చూపుతోనే అంచనా వేసి సదరు పత్తిని కొనుగోలు చేస్తారు. కానీ, ప్రైవేటు వ్యాపారుల వద్ద ధర దగ్గరే రైతులకు సమస్య ఎదురవుతోంది. సీసీఐ సెంటర్లలో క్వింటా పత్తికి కనిష్టంగా రూ.7,689 నుంచి గరిష్టంగా రూ.8,100 మద్దతు ధర వస్తుంటే, ప్రైవేట్ వ్యాపారుల వద్ద మాత్రం రూ.6,000 దాటడం గగనమే. సగటున క్వింటా రూ.5,500 చొప్పునే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని, దూరాభారాలు, వ్యయప్రయాసలు భరించి సీసీఐ కేంద్రాలకు వస్తే అక్కడ ఎదురయ్యే తేమ కొర్రీలను తట్టుకోవడం రైతులకు మరోసారి సాగు చేసినంత పని అవుతోంది. ఈ బాధలన్నీ పడలేక, వెంటనే డబ్బులు చెల్లించే ప్రైవేట్ వ్యాపారులకే పత్తిని అమ్ముకుంటున్నారు. అలా ఒక్కో క్వింటాకు సగటున రూ.1500 వరకు నష్టపోతున్నారు. అంటే ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి వచ్చినా.. ఒక సీజన్‌లో కనీసం రూ.10 వేల మేర కోల్పోవాల్సి వస్తోంది.
క్షేత్రస్థాయిలో రైతులకు సాగులో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అవసరమైన సాయం చేసేందుకు మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉంటారు. అలాగే ప్రతీ 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక ఉండగా అక్కడ వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈఓ) విధులు నిర్వర్తిస్తుంటారు. పత్తిలో తేమ కొలిచే పరికరం ధర కనిష్టంగా రూ.2,000 నుంచి గరిష్టంగా రూ. 8,000 వరకు మార్కెట్‌లో లభిస్తోంది. ప్రతీ రైతు వేదిక దగ్గర వరి, పత్తి పంటల్లో తేమను కొలిచే యంత్రాన్ని అందుబాటులో ఉంచితే, రైతులు తమ పంటల్లో ఎంత తేమ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాల మేరకు తేమ వచ్చే వరకు ఎదురుచూసి.. ఆ తర్వాత మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. లేదంటే తేమ శాతానికి తగ్గట్టుగా ప్రైవేటు వ్యాపారుల దగ్గర ధర డిమాండ్ చేసే అవకాశం రైతుకు దక్కుతుంది. కానీ వ్యవసాయశాఖ నుంచి అలాంటి చొరవ లేకపోవడంతో ప్రతీ సీజన్‌లో రైతులు అమ్మకాల సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది.
తేమతోనే కొర్రీలు


