లెక్క తప్పితే వేటే..
కచ్చితంగా లెక్క చెప్పాల్సిందే
● నామినేషన్లు దాఖలు నుంచే పరిగణనలోకి.. ● జనాభా ప్రాతిపదికన వ్యయ ఖర్చులు ● సర్పంచ్ అభ్యర్థి పరిమితి రూ.2.50 లక్షలు ● 2019 ఎన్నికల్లో 292 మందిపై అనర్హత వేటు
చుంచుపల్లి/భ ద్రాచలం అర్బన్ : పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. గురువారం నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు నిబంధనలను విధించింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖర్చుకు పరిమితి విధించింది. ఎన్నికల ప్రచారానికి పెట్టే ప్రతీ పైసకు కచ్చితంగా లెక్కలు సమర్పించాలని సూచించింది. ఈసీ ఇచ్చిన పుస్తకాల్లో అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలు నమోదు చేయాలి. పరిమితికి మించి ఖర్చు చేస్తే వేటు వేయనుంది. 2019 ఎన్నికల సందర్భంగా సకాలంలో లెక్కలు తెలపని 292 మందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఇందులో గెలుపొందిన వారు 96 మంది ఉన్నారు. వారి పదువులు రద్దు కాగా, ఓడిపోయిన వారు మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా వేటు పడింది.
ఈసీ నిర్ణయించిన ధరల ప్రకారమే..
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుకు పోటీ చేసే అభ్యర్థుల తరఫున రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చును కూడా వారి ఖాతాల్లోనే జమ చేస్తారు. ఖర్చుపై ఎప్పటికప్పుడు సర్వైలెన్స్ బృందాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, వీడియోలు, ఫొటోల ద్వారా లెక్కిస్తారు. ప్రచార సామగ్రికి ఎన్నికల సంఘం ముందుగానే ధరలు నిర్ణయించగా.. దాని ప్రకారమే అభ్యర్థుల ఖర్చులు చూపాల్సి ఉంటుంది. నామినేషన్ సమర్పణ నుంచి పోలింగ్ ముగిసే వరకు వ్యయాన్ని మూడు విడతల్లో అధికారులు తనిఖీ చేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లోగా వ్యయ వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలుకు రెండు రోజుల ముందే ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచి దాని ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి. ఐదు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలో వార్డు సభ్యులు రూ.30 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు వరకు ఖర్చు పెట్టొచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉంటే వార్డు సభ్యులు రూ. 50 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షల వరకు వెచ్చించే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఖర్చు విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి ప్రతీ పైసా నమోదు చేసుకోవాలి. ఖర్చుల వివరాలను రెండు రోజులకోసారి ఎంపీడీఓ కార్యాలయంలో తెలియజేయాలి. లెక్కలు చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈసీ నిబంధనల మేరకు అనర్హత వేటు పడుతుంది.
– కె.సంజీవరావు, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు
లెక్క తప్పితే వేటే..


