అభివృద్ధికి తొలిమెట్టు.. సైన్స్‌ఫేర్
కొత్తగూడెంఅర్బన్ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు అభివృద్ధి చెందేందుకు సైన్స్‌ఫేర్ తొలిమెట్టని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కొత్తగూడెం సెయింట్ మెరీస్ పాఠశాలలో మూడు రోజులుగా సాగుతున్న సైన్స్‌ఫేర్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి, అవగాహన పెరగడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా చూడాలని, తాను కూడా స్కూల్‌లో చదివేటప్పుడు సైన్స్‌ఫేర్‌లో పాల్గొంటే బహుమతి రాలేదని, అయినా తాను బాధ పడలేదని అన్నారు. జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలిచేదాకా ప్రయత్నించ్చాలని సూచించారు. డీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్, విజ్ఞానాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ ప్రయోగాలన్నీ పాఠశాల స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. జిల్లా సైన్స్ అధికారి సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఏడు విభాగాలలో 649 ప్రాజెక్టులు, ఇన్‌స్పైర్ విభాగంలో 84.. మొత్తం 733 ప్రయోగాలు ప్రదర్శించామని వివరించారు. ఇందులో రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌కు 26, ఇన్‌స్పైర్ పోటీలకు 9 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని చెప్పారు.
కాగా, సైన్స్‌ఫేర్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మెమెంటో, సర్టిఫికెట్లను, పాల్గొన్న ప్రతీ విద్యార్థి, గైడ్ టీచర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన అధికారులు నీరజ, నాగరాజశేఖర్, సైదులు, సతీష్, ఎంఈఓలు మధురవాణి, బాలాజీ, ఝుంకీలాల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


