స.హ. చట్టంతోనే పారదర్శక పాలన
సూప్‌బజార్(కొత్తగూడెం): సమాచార హక్కు చట్టంతోనే పారదర్శక పాలన సాధ్యమని ఆర్‌టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం స.హ. చట్టం అమలు, పెండింగ్ కేసుల పరిశీలన, పౌర సమాచార అధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి శక్తినిచ్చే కీలక సాధనమని అన్నారు. అవినీతిని నిర్మూలించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి చట్టంలోని నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో పనిచేయాలని సూచించారు. ఆర్టీఐ ద్వారా సమాచారం అందించినప్పుడే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు. గత రెండేళ్లుగా ఆర్టీఐ కమిషన్ నియామకం లేకపోవడంతో అనేక దరఖాస్తులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ కేసులన్నింటినీ వేగంగా పరిష్కరించేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులపై పూర్తి వివరాలు సేకరించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాళ్ శ్రేష్ఠ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ శాఖ తమకు వచ్చిన స.హ.చట్టం దరఖాస్తులను సకాలంలో సమాచారం అందించాలని అన్నారు. అధికారులు తమ పరిధిలోని దరఖాస్తులు వివరాలను రిజిస్టర్‌లో పొందుపరచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి


