గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు హాస్పిటల్ బిల్లింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని కిమ్స్ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ ఇచ్చాక ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 – 26 ఏళ్ల వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, శిక్షణ సమయంలో మహిళలకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 29వ తేదీ ఉదయం 10గంటలకు ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగే ఇంటర్వ్యూలకు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని పీఓ సూచించారు.
‘తానా’ సమ్మేళనానికి ఆదివాసీ విద్యార్థిని
భద్రాచలంటౌన్: ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి చెందిన ఆదివాసీ విద్యార్థిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి బాల రచయితల సమ్మేళనంలో పాల్గొననుంది. భద్రాచలానికి చెందిన మడివి గురుత్వ సమందా సింగ్.. యజ్ఞజా స్కూల్‌లో చదువుతోంది. ఈనెల 30న 13 గంటల పాటు ‘బాలసాహిత్య భేరి‘ పేరుతో వర్చువల్‌గా జరిగే ఈ సమ్మేళనంలో 101 మంది పాల్గొననుండగా సమందా మూడు నిమిషాల పాటు కథ వినిపించనుంది. ఈ సందర్భంగా విద్యార్థిని యజ్ఞజా స్కూల్ కరస్పాండెంట్ సీహెచ్.ఉషారాణి, ఉపాధ్యాయులు అభినందించగా.. తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి, ఎంపీని కలిసిన
డీసీసీ అధ్యక్షురాలు
కొత్తగూడెంఅర్బన్: డీసీసీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన తోట దేవీప్రసన్న బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ ఆమెను అభినందించారు. జిల్లాలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు. ఆమె వెంట నాయకులు ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్ ఉన్నారు.
ఇన్‌చార్జ్ డీపీఓగా సుధీర్
చుంచుపల్లి: జిల్లా పంచాయతీ అధికారిగా భద్రాచలం డీఎల్‌పీఓ సుధీర్‌కు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం అదనపు బాధ్యతలు అప్పగించారు. డీపీఓ బి.అనూష శాఖాపరమైన శిక్షణకు వెళ్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఓఈఆర్ 20.01 ప్రకారమే పామాయిల్ ధర
అశ్వారావుపేటరూరల్: ఓఈఆర్ 20.01శాతం, నట్(గింజలు)పై 10.08 శాతం ప్రకారమే పామాయిల్ టన్ను గెలల ధర చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయిల్‌ఫెడ్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో ధర నిర్ణయంపై సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు.
గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ


