
రజాకార్లతో రణం చేసి..
వరుసదాడులతో ఆయుధాలు సమకూర్చుకున్న విప్లవకారులు
పాల్వంచలో రజాకార్లతో తలపడిన కోయ దళాలు
గుంపెనలో కమ్యూనిస్టు దళంపై నిజాం సైన్యం దాడి
సంఘం పోరాటంతో సింగరేణి కార్మికులకు దక్కిన హక్కులు
కృష్టా జిల్లా నందిగామ తాలూకాలో పరిటాల సమీపాన పోలీస్ హెడ్‌క్వార్టర్‌పై విప్లవకారులు దాడి చేసి ఆయుధాలు సంపాదించారు. ఆ తర్వాత మోటమర్రిలో మిలిటరీ క్యాంపుపైనా దాడి చేశారు. ఆపై మైదాన ప్రాంతాల్లోని జమీందార్ల గడీలు, ఇళ్లపై దాడులు చేస్తూ ఆయుధ సంపత్తి పెంచుకున్నారు. దీంతో గ్రామ దళాలకు బర్మార్లు, గెరిల్లా పోరాటం చేసేవారికి షాట్‌గన్‌లు, ఆపై స్థాయిలో ఉండేవారికి 12 బోర్ రైఫిళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీరితో 50 గ్రామాల్లో ప్రత్యేక రక్షక దళాలు ఏర్పడ్డాయి. మరోవైపు గిరిజన ప్రాంతాలకు వెళ్లిన కామ్రేడ్లు ‘ఫారెస్టు’ జులుంను అడ్డుకుని కోయ ప్రజల నమ్మకం పొందారు. ఫలితంగా 1948 ఏప్రిల్ నాటికి జిల్లాలో సుమారు వేయి మంది కోయ సభ్యులు గెరిల్లా పోరాటంలో భాగస్వాములయ్యారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్ర మహాసభ ప్రభావం ఎక్కువగా ఉండేది. చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, సర్వదేవభట్ల రామనాథం వంటి నాయకులు ఇక్కడ పార్టీని బలోపేతం చేశారు. 12వ ఆంధ్ర మహాసభ 1945లో ఖమ్మంలో సుమారు ఇరవై వేల మందితో జరిగింది. ఈ సభ స్ఫూర్తితోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడగలమనే ధీమా విప్లవకారులకు వచ్చింది. దీంతో 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం వరంగల్ జిల్లాలోని విస్నూర్ గడి కేంద్రంగా రగులుకుంది. దీంతో ముందుజాగ్రత్తగా ఖమ్మం, మధిర, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఇల్లెందు, పాల్వంచ, ములకలపల్లి వంటి ప్రాంతాల్లో రజాకార్లు క్యాంపులు ఏర్పాటుచేశారు. గ్రామాల్లోకి కమ్యూనిస్టులు రాకుండా, సంఘాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పాల్వంచలో కోయదళంపై దాడి..
వేంసూరు సంస్థానంలో భూపంపిణీ చేసిన దళాలు తమ తదుపరి కార్యక్షేత్రంగా పాల్వంచ సంస్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ 120 మంది ఆదివాసీ/కోయ యువకులతో గెరిల్లా దళం ఏర్పాటు కాగా, భూపంపిణీ మొదలైంది. దాన్ని అణచివేసేందుకు నిజాం సర్కార్ వేయి మంది సైనికులను పాల్వంచ తాలూకాకు పంపింది. పదిహేను రోజుల పాటు జరిగిన పోరులో ఎనిమిది మంది నిజాం సైనికులు చనిపోయారు. అలాగే, గెరిల్లా దళ నాయకుడు ముత్యాలు మృతిచెందగా మరో ఆరుగురిని నిజాం సర్కార్ ఉరి తీసింది. ఆ తర్వాత రజాకార్ దళాలు ములకలపల్లిలో క్యాంపు ఏర్పాటు చేశాయి. పాల్వంచలో నష్టపోయిన కోయ దళాలు ములకలపల్లిలోని రజాకార్ క్యాంపుపై దాడులు చేశాయి. చివరకు బతుకుజీవుడా అంటూ ఈ క్యాంపును ఎత్తివేయాల్సి వచ్చింది.
గుంపెన పోరాటం..
అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో 1948లో రజాకార్లకు – సాయుధ పోరాట యోధులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. వట్టికుంట నాగేశ్వరరావు నేతృత్వంలో గుంపెనలో సమావేశమైన 70మంది సభ్యులతో కూడిన దళాన్ని కల్లూరు నుంచి భారీ సంఖ్యలో వచ్చిన రజాకార్లు చుట్టుముట్టారు. దీంతో విప్లవకారులు ప్రాణాలకు తెగించి పోరాడుతూ అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఒక గెరిల్లా, మరో ఇద్దరు గుంపెన గ్రామస్తులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత దళాల నిర్వహణపై కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. సాయుధ దళంలో 20కి మించి సభ్యులు ఉండకూదనే తీర్మానం చేశారు.
కార్మిక సంఘం ఏర్పాటు..
సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రహస్యంగా ఏర్పడింది. హెడ్డాఫీసులో క్లర్క్‌గా పనిచేస్తున్న శేషగిరిరావు పోరాటంలో మొదటి అడుగు వేశారు. శేషగిరిరావు నేతృత్వంలో సాయుధ దళాలు రంగంలోకి దిగి కార్మికుల హక్కుల కోసం పోరాడాయి. ఫలితంగా కాంట్రాక్టు విధానం రద్దయి ఉద్యోగులనే గుర్తింపు వచ్చింది. మహిళలు, పిల్లలను గనుల్లో పని చేయించడంపై నిషేధం విధించగా.. ఉపాధి కోల్పోయిన మహిళలకు సింగరేణి పవర్ ప్లాంట్లలో పని కల్పించారు. చివరకు శేషగిరిరావును 1948 ఏప్రిల్‌లో నెల్లిపాక వద్ద నిజాం పోలీసులు కాల్చి చంపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటం జోరందుకునే సమయంలో 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీస్ చర్యతో నిజాం సర్కార్ కుప్పకూలింది. హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనమైంది. ఆ తర్వాత జరిగిన మలి దశ పోరాటానికి భద్రాద్రి జిల్లా అడవులే కేంద్ర స్థానాలయ్యాయి.
రైతాంగ పోరాటానికి బాటలు వేసిన ఖమ్మం మహాసభ
2

రజాకార్లతో రణం చేసి..