
వినిపించని ప్రజా‘వాణి’!
ప్రచార లోపంతో గ్రీవెన్స్‌కు ప్రజలు దూరం ఖాళీగా దర్శనమిస్తున్న డివిజన్ కార్యాలయాలు
భద్రాచలం: డివిజన్, మండలాల పరిధిలోనే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేపట్టిన ‘ప్రజావాణి’కి ప్రజల నుంచి స్పందన కరువైంది. సాధారణంగా ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తారు. అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్, మండలాల పరిధిలోనే నిర్వహించాలని మూడు వారాల క్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగూడెంలో ఆర్‌డీఓ, భద్రాచలంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో, మండలాల్లో తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమస్యలపై వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇన్‌వార్డ్ ఇన్‌చార్జ్‌ను ఏర్పాటు చేశారు.
ప్రజల నుంచి స్పందన కరువు..
కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రాచలం సబ్ కలెక్టరేట్, కొత్తగూడెం ఆర్‌డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నా.. ప్రజలు మాత్రం ఫిర్యాదులు ఇచ్చేందుకు రావడం లేదు. భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో మూడు వారాలుగా ఒక్క సమస్య కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మండల కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫిర్యాదుదారులు రాక కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఈ సోమవారం భద్రాచలం మండల కార్యాలయంలో ఒకటి, దుమ్ముగూడెంలో ఐదు, చర్లలో ఏడు, బూర్గంపాడులో ఐదు, అశ్వాపురంలో ఏడు, పినపాకలో ఆరు, కరకగూడెంలో మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మణుగూరులో మాత్రం 51 మంది పలు సమస్యలపై వినతులు ఇచ్చారు.
ప్రచార లోపమే కారణం !
ప్రజావాణి కార్యక్రమాలకు స్పందన కరువవడానికి ప్రచార లోపమే కారణమని పలువురు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అధికారులు ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత పోస్టులు పెడుతుండడంతో ప్రజలకు ఆలస్యంగా సమాచారం అందుతోంది. ఇక నిరక్షరాస్యులు, సోషల్ మీడియాకు దూరంగా ఉండేవారికి ప్రజావాణి సమాచారం అసలు తెలియడమే లేదు. దీనికి తోడు మండల, డివిజన్ కార్యాలయాల్లో ఇప్పటికే ఆయా సమస్యలపై వినతపత్రాలు అందజేసిన వారు.. పరిష్కారం కాకపోతే నేరుగా కలెక్టర్‌కు విన్నవించేవారు. కలెక్టర్ దృష్టికి వెళితే సమస్య పరిష్కారం అయ్యేది. అయితే ఇప్పుడు మండల, డివిజన్ కేంద్రాల్లోనే వినతులు ఇస్తే అవి పరిష్కారం కావనే భావనతో పలువురు గ్రీవెన్స్‌కు రావడం లేదని తెలుస్తోంది. ఇకపై కలెక్టరేట్‌లోనే ప్రజావాణి నిర్వహించాలని, లేదంటే డివిజన్, మండలాల్లో నిర్వహించే గ్రీవెన్స్‌పై విస్తృత ప్రచారం చేయాలని పలువురు కోరుతున్నారు.
మండల కేంద్రాల్లోనూ అదే పరిస్థితి