
వెదురు సాగు లాభదాయకం
వెంకటమ్మా.. నీతో ఫొటో దిగాలి..
ములకలపల్లి : వెదురు సాగు ఎంతో లాభదాయకమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని మూకమామిడి, మొగరాలగుప్ప గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పలువురు రైతుల చేలల్లో వెదురు మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. సుమారు 1000 కి.మీ. నుంచి నాణ్యమైన వెదురు మొక్కలు తెప్పించినట్లు తెలిపారు. ఎకరానికి 160 మొక్కలు పెంచొచ్చని, వీటికి ముళ్లు ఉండవని, తక్కువ కాలంలో గడలు ఏపుగా పెరుగుతాయిని వివరించారు. మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంటుదని, రెండేళ్ల పాటు అంతరపంటగా బొబ్బెర, పెసర, జొన్న వంటి పంటల సాగుతో అదనపు ఆదాయం పొందొచ్చని చెప్పారు. పంట మార్పిడి పద్ధతి పాటించాలని, చేపల చెరువులు, కౌజు పిట్టల పెంపకంపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. అనంతరం మూకమామిడిలో అసంపూర్తిగా ఉన్న జీపీ కార్యాలయ భవనాన్ని పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని పీఆర్ ఏఈ సురేశ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ విద్యాచందన, తహసీల్దార్ భూక్యా గన్యా, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏడీఏ రవికుమార్, ఎంఏఓ అరుణ్‌బాబు, ఏపీఓ హుస్సేన్, ఏఈలు వరప్రసాద్, గఫూర్ పాషా పాల్గొన్నారు.
విత్తన సేకరణ భేష్..
అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు పంచాయతీ బంజర నెల్లిపాక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చేపట్టిన విత్తన సేకరణ భేష్ అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రశంసించారు. హెచ్‌ఎం విమల ఆధ్వర్యంలో సేకరించిన 362 రకాల విత్తనాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. విత్తనాల సేకరణలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీమయని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ విద్యాచందన, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంఈఓ వీరస్వామి, ఎంపీఓ ముత్యాలరావు, ఏపీఓ సీతరాములు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు.
‘మునగ తోటలో అంతరపంటగా బెండతోట సాగు చేస్తున్నారా .. సంతోషంగా ఉంది’ అంటూ మహిళా రైతును కలెక్టర్ అభినందించారు. మొగరాలగుప్ప శివారులో ఎకరం విస్తీర్ణంలో మహిళా రైతు వెంటకమ్మ సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించారు. ఒకే భూమిలోపామాయిల్, మధ్యలో మునగ, ఖాళీ ప్రదేశంలో బెండ సాగు చేయడంపై అభినందించారు. ఆమెను పిలిచి మరీ ఫొటో దిగారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్