
శ్రీకృష్ణుడిగా భద్రగిరి రామయ్య
రామాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
నేడు ఉట్ల పండుగకు ఏర్పాట్లు
భద్రాచలం : ‘జో అచ్యుతానంద.. జోజో ముకుందా..’ అంటూ చిలిపి కృష్ణయ్యగా మారిన భద్రాద్రి రామయ్యకు వేదపండితులు, అర్చకులు జోలలు పాడారు. దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చిన రామచంద్రస్వామిని తిలకించిన భక్తులు తరించారు. రామయ్య సన్నిధిలో సోమవారం ఊంజల్ సేవను వైభవోపేతంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం సోమవారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలు కనులపండువగా జరిపారు. స్వామి వారికి సాయంత్రం దర్బార్ సేవ నిర్వహించాక బేడా మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో వేంచేపు చేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఆస్థాన గాయకులు, అర్చకులు జోలలు..లాలలు పాడారు. స్వామివారికి పంచామృతాభిషేకం చేసి తొమ్మిది రకాల ప్రసాదాలను నివేదన చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు కేఈ స్థలశాయి భాగవతంలోని శ్రీ కృష్ణ జనన ఘట్టాన్ని భక్తులకు వివరించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం దేవస్థానం ఆధ్వర్యంలో ఉట్ల పండుగ నిర్వహించనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముత్తంగి అలంకరణలో రామయ్య..
దేవస్థానంలో మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.