
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం దర్బార్‌లో దరఖాస్తులు అందించవద్దని, నిరుద్యోగులు, ప్రతిభ కలిగిన యువత స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్హతల మేరకు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామానికి చెందిన సులోచన, ఇతర మహిళలు నూతన ఇసుక సొసైటీ ఏర్పాటుకోసం, ములకలపల్లి మండలం పాత జెండాలపాడు గ్రామానికి చెందిన రమేష్ పొలంలో సోలార్ కనెక్షన్ ఇప్పించాలని, అశ్వారావుపేట మండలం అంజుబాకకు చెందిన రాజేశ్వరి భూ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఈఈ సత్యానందం, ఏఓ రాంబాబు, ఇన్‌చార్జ్ ఎస్‌ఓ భాస్కరన్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, వివిధ శాఖల అధికారులు ఉదయ్‌కుమార్, రాజారావు, ప్రభాకర్‌రావు, ఆదినారాయణ, హరికృష్ణ, నారాయణరావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్