
యూరియా కోసం రైతుల తోపులాట
జూలూరుపాడు: జూలూరుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద సోమవారం యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. రైతులు సోమవారం ఉదయం 5 గంటలకే పీఏసీఎస్‌కు చేరుకుని తమవంతు కోసం వరుసలో చెప్పులు పెట్టుకున్నారు. 6 గంటల నుంచి సుమారు 250 మంది రైతులు క్యూలైన్‌లో బారులుదీరారు. పీఏసీఎస్ ఉద్యోగులు కూపన్లు ఇవ్వడం ప్రారంభించాక, కూపన్లకు తమవరకు వస్తాయో, రావోననే ఆందోళనతో కొందరు రైతులు క్యూలైన్ నుంచి ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, ఘర్షణకు దారితీసింది. మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు నచ్చజెప్పడంతో సద్దుమణిగింది. పీఏసీఎస్ ఉద్యోగులు 100 మంది రైతులకు కూపన్లు అందించి, ఒక్కో యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు. మరో 150 మంది రైతులు యూరియా దొరకక నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై సహకార సంఘం సెక్రటరీ రమణారెడ్డిని వివరణ కోరగా.. కూపన్ పొందిన రైతులకు ఒక యూరియా బస్తా చొప్పున అందించామని, సహకార సంఘం కార్యాలయంతోపాటు, పడమటనర్సాపురం రైతు వేదికలో కూడా యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
250 మంది వస్తే 100 మందికే
ఒక్కో బస్తా చొప్పున పంపిణీ