
మాకూ కావాలి..
బెంగాలీ కూలీ..
పినపాక: పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు కూలీలు వలస వచ్చి ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు. పొలాల దగ్గరే గుడారాలు వేసుకుని ఉంటూ.. ఇక్కడి కూలీలతో పోలిస్తే తక్కువ తీసుకుంటూ పని పూర్తి చేస్తున్నారు.
అయితే, వీరు నాట్లు వేసే విధానం ఎంతో మేలు చేకూర్చుతోందని రైతులు చెబుతున్నారు. వారంతా కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి వరి నాట్లు వేస్తుండటంతో రోజురోజుకూ వారికి డిమాండ్ పెరుగుతోంది. రైతులు బెంగాలీ కూలీలతో పనిచేయించుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.
ఉపయోగాలు ఇవీ..
విత్తనాలు తక్కువ పడతాయని, నారు వృథాగా పోదని, ఎకరాకు 15 కేజీల వడ్లు సరిపోతాయని, రెండు బస్తాల దిగుబడి ఎక్కువగా వస్తుందని, పద్ధతిగా లైను కట్టినట్టు వేస్తారని, కలుపు మందుల ఖర్చు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు.
నాటు వేసే విధానం
బెంగాలీ కూలీలు నాటు వేసేటప్పుడు దారాలతో లైన్లు చూసుకుంటూ ఒక పద్ధతిలో వేయడంతో ఖర్చు తగ్గుతోంది. లైన్‌కు లైన్‌కు మధ్యలో గ్యాప్ చూసుకుంటూ నాట్లు వేయటం వల్ల వెలుతురు, గాలి సోకి పురుగు రాదు. దీంతో పురుగు ముందులు ఒకటి – రెండు సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది. వారు ఎకరాకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు తీసుకుంటారు. రవాణా ఖర్చు ఉండకుండా పొలాల దగ్గరే గుడారాలు వేసుకొని ఉంటారు. ఇక్కడి కూలీలు రూ.5 వేల వరకు తీసుకోవడంతోపాటు రవాణా ఖర్చు కూడా ఉంటుంది. కానీ, బెంగాలీ కూలీలతో ఎకరాకు రూ.6 వేల వరకు కలిసి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తెలిపారు. ఏటా 80 నుంచి 100 మంది వచ్చి నాట్లు వేసి వెళ్తుంటారు.
అక్కడి కూలీలతో చకాచకా వరి నాట్లు
పొలాల దగ్గరే గుడారాల్లో నివాసం
పని పూర్తయ్యాక మరోచోటికి..
అక్కడ పనిలేక ఇక్కడికి వలస
పెరుగుతున్న డిమాండ్

మాకూ కావాలి..