
నల్ల బ్యాడ్జీలతో ఆలయ ఉద్యోగుల నిరసన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థాన ఈఓ రమాదేవిపై దాడిని నిరసిస్తూ టీఎన్‌జీవోస్ డివిజన్ శాఖ, భద్రాద్రి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, వివిధ దేవస్థానాల వైదిక పరిపాలన సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో బుధవా రం తానీషా కల్యాణ మండపం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆలయ భూములను పరిరక్షించడానికి వచ్చిన దేవస్థానం సిబ్బందిపై అభ్యంతరకరంగా మాట్లాడటమే కాకుండా దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, భద్రాద్రి రామయ్య భూముల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు చోటుచేసుకోకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కాగా, నిరసన కార్యక్రమానికి శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆల య పాలకమండలి సభ్యులు బుధవారం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డెక్క నరసింహారావు, గగ్గూరి బాలకృష్ణ, ఏఈఓ భవానిరామకృష్ణారావు, రవీంద్రనాథ్, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు, కుసుమ హరినాథ ఆలయ చైర్మన్ యక్కటి శ్రీనివాసరావు సభ్యులు తంబళ్ల కృష్ణార్జున్‌రావు, పునుగుపాటి సీత, తంగెళ్ల సుజాత పాల్గొన్నారు.
భద్రాద్రి ఈఓపై దాడి బాధాకరం
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముల వారి భూములు కబ్జా చేయడంతోపాటు అడ్డుకునేందుకు వెళ్లిన ఈఓ రమాదేవి, సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భద్రాద్రి రాముడిపై భక్తితో దాదాపు 900 ఎకరాల స్థలాన్ని ఓ దాత దానం చేశారని, ఇదే విషయంలో గతంలో దేవాలయ గోశాలను కూడా కబ్జా చేస్తూ.. వెళ్లేందుకు దారి మూసివేసిన విషయంపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన చేసిందని గుర్తు చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భద్రాద్రి రాముడి భూముల రక్షణకు ప్రత్యేక కమిటీ వేసిందని పేర్కొన్నారు. కానీ, నేడు కబ్జాదారులు చెలరేగిపోవడం.. ఏకంగా ఆలయ ఈఓ పైనే దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. భద్రాద్రి రాములలోరి అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. కాగా, భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవిపై దాడి హేయమైన చర్య అని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.