
ఆనాటి నిర్లక్ష్యం.. రూ.6 కోట్ల భారం!
ప్రారంభించిన ఆరు నెలలకే పగుళ్లు..
సింగరేణి సంస్థ పరిధిలోని కొత్తగూడెం ఏరియాలో ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 145 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 11 ఏరియాల్లో కొత్తగూడెం అగ్రస్థానంలో నిలిచింది. ఏరియాలోని సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి రవాణా సక్రమంగా సాగితే కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చనే ఆలోచనతో యాజమాన్యం సీహెచ్‌పీని నిర్మించింది. ఇందుకోసం సమంత కంపెనీకి రూ.398 కోట్లతో టెండర్ కట్టబెట్టింది. పనులు దక్కించుకున్న సంస్థ రెండున్నరేళ్లపాటు నిర్మాణ పనులు సాగించింది. సుమారు ఏడాదిన్నర క్రితం సీహెచ్‌పీ అందుబాటులోకి రాగా రైలు ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నారు. కానీ ప్రారంభించిన ఆరు నెలలకే నాణ్యతాలోపాలు వెలుగుచూశాయి. సీహెచ్‌పీ బంకర్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఏడాది నుంచి బొగ్గు రవాణాకు ఆటంకం కలుగుతోంది. రోజుకు 10 రేక్‌ల తరలించాల్సి ఉండగా, పగుళ్ల కారణంగా అతి కష్టంపై 5–6 రేక్‌లు కూడా దాటడం లేదు. వెరసి లక్ష్యం మేరకు ఉత్పత్తి సాగుతున్నా వినియోగదారులకు సకాలంలో బొగ్గు అందించలేకపోతున్నారు.
సరిపడా మెటీరియల్ కూడా వాడలేదు..
జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి బొగ్గును రైలు మార్గం ద్వారా రవాణా చేసేందుకు 8 వేల టన్నుల కెపాసిటీ కలిగిన మూడు బంకర్లను నిర్మించారు. వాటిలో ఒక బంకర్‌లో పూర్తిగా, మరో బంకర్‌లో పాక్షికంగా పగుళ్లు వచ్చాయి. 8 వేల టన్నుల సామర్థ్యానికి సరిపడా మెటీరియల్ వాడాల్సి ఉండగా, కేవలం 6 వేల టన్నులకు తగిన మెటీరియలే వాడారని, అందుకే బంకర్‌లో బీటలు ఏర్పడ్డాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.
మెయింటెనెన్స్ నిర్మాణ సంస్థదా? సింగరేణిదా?
సాధారణంగా పనులు పూర్తై అప్పగించాక కొన్నేళ్లపాటు నిర్మాణ సంస్థే మెయింటెనెన్స్‌కు బాధ్యత వహించాలి. కానీ టెండర్ అగ్రిమెంట్‌లో మెయింటెనెన్స్ విషయం పేర్కొన్నారా? లేదా అనే విషయం బహిర్గతం కావడంలేదు. పగుళ్లు ఏర్పడ్డా సదరు సంస్థ పట్టించుకోవడంలేదు. బీటల కారణంగా బంకర్ ఏడాది నుంచి నిరుపయోగంగా మారింది. ఇందుకు మరమ్మతులు చేపట్టేందుకు మరో రూ. ఆరు కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ పనుల రెన్యువేషన్ సింగరేణి యాజమాన్యం టెండర్లు పిలిచింది.
బాధ్యులపై చర్యలేవి?
రూ. 398 కోట్లతో చేపట్టిన పనులను ఆనాటి ఏరియా ఉన్నతాధికారి, సివిల్, క్వాలిటీ, విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించినా సింగరేణి విజిలెన్స్ ఎందుకు గుర్తించలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కనీసం 60 ఏళ్ల వరకు పటిష్టంగా ఉండాల్సిన సీహెచ్‌పీకి రెండేళ్లకే మరమ్మతులు చేపట్టాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో సీహెచ్‌పీ మనుగడ నీలినీడలు అలుముకుంటున్నాయి. ఇందుకు కారణమైన అప్పటి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు, కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.
బ్లాక్ లిస్ట్‌లో పెట్టాం..
సత్తుపల్లిలోని సీహెచ్‌పీ బంకర్‌లో పగుళ్లపై విచారణ చేయించగా నిర్మాణ సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. సమంత కంపెనీ సింగరేణిలో ఏ పని చేయకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాం. కోల్‌ఇండియా పరిధిలోనూ పనులు ఇవ్వొద్దని లేఖ రాశాం. సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులకు టెండర్ పిలిచాం. – శాలేంరాజు, కొత్తగూడెం ఏరియా జీఎం
రూ.398 కోట్లతో నిర్మించిన సీహెచ్‌పీలో నాణ్యతలేమి
బంకర్లలో పగుళ్లపై విచారణలో వెల్లడైన లోపాలు
సింగరేణిలో గత అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు
మరమ్మతులకు టెండర్ పిలిచిన యాజమాన్యం
డిజైన్‌లోనే లోపం
నిర్మాణ పనులను అప్పటి జీఎం, ఇతర విభాగాల అధికారులు పర్యవేక్షించకుండా కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఆరు నెలలకే సీహెచ్‌పీ బంకర్‌లో బీటలు వారాయని పేర్కొన్నారు. పగుళ్లు ఏర్పడి కూలేందుకు సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై సంస్థ సెంట్రల్ మైనింగ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా విచారణ జరిపించగా డిజైన్‌లోనే లోపముందని, బంకర్ నిర్మాణానికి నాణ్యమైన సామగ్రి వాడలేదని తేలింది.

ఆనాటి నిర్లక్ష్యం.. రూ.6 కోట్ల భారం!