
‘ఉపాధి’లో వేతన వెతలు
● నాలుగు నెలలుగా అందని జీతభత్యాలు ● తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు ● జిల్లాలో 459 మంది ఉపాధి హామీ సిబ్బంది
చుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలందడంలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2006లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. పే స్కేల్ అమలు చేయడంలేదు. వేతనాలు, పే స్కేల్ విషయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చడంలేదు. ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్పర్శ పేరిట డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో సిబ్బంది వివరాల నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో వేతనాల చెల్లింపు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన చెందుతున్నారు.
పెరుగుతున్న పనిభారం
ఉపాధిహామీ పథకంలో జిల్లావ్యాప్తంగా 459 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఏపీఓలు, సాంకేతిక సలహాదారులు (ఈసీలు), సాంకేతిక సహాయకులు(టీఏలు), కంప్యూటర్ ఆపరేటర్లు, క్షేత్ర సహాయకులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఒకవైపు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఖాళీలతో అదనపు బాధ్యతలు తప్పడం లేదు. జిల్లాలో 481 పంచాయతీలు, 22 మండలాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించలేదు. ఒక్కో గ్రామంలో కనీసం నాలుగైదు ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యలో సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని సాంకేతిక సహాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, అదనపు సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ సిబ్బంది బాధ్యతలు..
ఉపాధి సిబ్బంది గ్రామంలో ఉపాధి కూలీలతో పనులు చేయించాలి. మస్టర్ల నమోదు, కొలతలు వేయాలి. గ్రామ నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం వంటివి పర్యవేక్షించాలి. గ్రామసభల్లో గుర్తించిన, రైతులు దరఖాస్తు చేసుకున్న పనులను కంప్యూటర్లలో నమోదు చేయాలి. కూలీల కోసం గ్రామసభల్లో పనులను గుర్తించాలి. కొలతల ప్రకారం పనులను పంచాయతీ కార్యదర్శి, ఎస్‌ఏలు, సీనియర్ మేట్లకు అప్పగించాలి. గ్రామాల్లో మేట్లు ఇచ్చిన కొలతలు సరిగా ఉన్నాయో లేవో ప్రతీ వారం తనిఖీ చేయాలి. వారం చివరలో పనుల కొలతలను మస్టర్లలో నమోదు చేయాలి. ఎంబీ పుస్తకంలో నమోదు చేసి ఇంజినీర్ కన్సల్టెన్సీకి నివేదించాలి.