
‘జీఎస్‌టీ’తో సమస్యలు పరిష్కరించాలి
ముంబై ఐఐటీ ప్రొఫెసర్
కన్నన్ మౌడగలయ
భద్రాచలంటౌన్: ఓపెన్ సోర్స్ జియో స్పెషల్ టెక్నాలజీ (జీఎస్‌టీ) ద్వారా విద్యార్థులు, అధికారుల భాగస్వామ్యంతో సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా కృషి చేయాలని ప్రిన్సిపాల్ ఇన్వెస్ట్ గ్రేటర్ ఆఫ్ ద ఫోజ్ ప్రాజెక్ట్, బాంబే ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న స్వయం ఉపాధి, సంక్షేమ పథకాలతో కలుగుతున్న ఉపయోగాలను తెలుసుకునేందుకు వైటీసీ, ట్రైబల్ మ్యూజియంను ఆదివారం ఆయన కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ గిరిజనులు సాంకేతిక పరంగా, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపించాలని చెప్పారు. గిరిజనులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేయడంతో కలెక్టర్‌కు ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహర్ట్ అవార్డులను అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కలెక్టర్ ప్రజలకు సూచించిన ఆదాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడేందుకు మ్యూజియంను ఏర్పాటు చేయడంపై ఐటీడీఏ పీఓను అభినందించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగులు జీవనోపాధి పొందేలా వైటీసీ ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మట్టితో ఇటుకలు తయారుచేసి జీవనోపాధి పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చామని, అందుకు సంబంధించిన యంత్రాలను సబ్సిడీపై అందించామని వివరించారు. ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, మేనేజర్ ఆదినారాయణ, ఆర్‌ఐ నరసింహారావు, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బయోచార్‌ను ఎరువుగా ఉపయోగించాలి
సుజాతనగర్: రైతులు బయోచార్‌ను పంటలకు ఎరువుగా ఉపయోగించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. రాఘవపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బయోచార్ యూనిట్ ప్రక్రియను ఆదివారం ఆయన బాంబే ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో విరివిగా లభించే తుమ్మ చెట్టు కొమ్మలు, రహదారులు, కరెంట్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను ఉపయోగించి తయారు చేయాలని సూచించారు.