భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్య సేవలో..
శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని ఆదివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలోని మూలమూర్తులకు పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు ఆశీర్వచనం గావించారు. ఆలయ ఈఓ రమాదేవి స్వామివారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమ, మంగళవారాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఖమ్మం 31వ డివిజన్‌లో మోడ్రన్ మార్కెట్ యార్డు ఆధునికీకరణ పనులు పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఈ కాంప్లెక్స్‌ను సందర్శించి, అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్తగూడెం నుంచి బయలుదేరి 3 గంటలకు రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాకు చేరుకుంటారు. అక్కడ చింతగుర్తి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మైనారిటీలతో సమావేశం నిర్వహిస్తారని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
‘ఎర్త్‌సైన్సెస్’కు రేపు
పరిశీలకుల రాక!
కొత్తగూడెంఅర్బన్: కేఎస్‌ఎంలోని మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఈ నెల 22న ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ యోగితారాణా, హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, కాకతీయ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో సదుపాయాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించినట్లు తెలుస్తోంది. సదుపాయాలు కల్పించాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. పరిశీలకుల బృందం పర్యటనపై యూనివర్శిటీ ప్రిన్సిపాల్ జగన్మోహనరాజును సంప్రదించగా.. తనకు సమాచారం లేదని తెలిపారు.
రామయ్యకు సువర్ణ పుష్పార్చన