
వరి పైరుకు ఊతమిచ్చేలా..
● అధిక దిగుబడులకు అజోల్లా దోహదం ● పశువుల మేతగా వినియోగం ● రైతులకు అవగాహన సదస్సులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతాంగం దృష్టి మరల్చడానికి, నాణ్యమైన దిగుబడులు సాధించడానికి వ్యవసాయ అధికారులు దృష్టి సారించి ఆ దిశగా రైతాంగాన్ని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే బయోచార్ ద్వారా అధిక దిగుబడులు, వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గించుకోవచ్చని కలెక్టర్ స్థాయి నుంచి వ్యవసాయ అధికారులు, కింది స్థాయి వరకు రైతాంగాన్ని చైతన్యం చేయడంలో నిమగ్నమై ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. అదే విధంగా వరికి ఎంతో ఉపయోగమైన అజోల్లా పెంపకం, వాడకంపై అధికారులు దృష్టి సారించి రైతులను చైతన్యపరుస్తున్నారు.
ఎక్కువ పోషణ..
అజోల్లా వాడకం వల్ల భూసారం పెరుగుతుంది. హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజని సహజంగా అందిస్తుంది. పశువుల మేతగా ఉపయోగపడుతూ వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇప్పటి వరకు మేలైన గడ్డి జాతులైన బెర్సీం, లూసర్న్, అలసంద మొక్కల కంటే 25 నుంచి 30 శాతం ప్రోటీన్లు ఎక్కువగా ఉండి మంచి పోషణ ఇస్తుందని పరిశోధనలో వెల్లడైంది. కాగా దీని వాడకంపై చాలామంది రైతులకు అవగాహన లేదు.
పెంచే విధానం..
● వారం రోజుల్లో పెరిగే అజోల్లాలను ఇంటి పెరటిపైన, డాబాలపై ఇలా ఎక్కడైనా పెంచుకోవచ్చు.
● సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు ముందుగా 10సెం.మీ లోతు, 2.25 మీటర్ల వెడల్పుతో తొట్లను తయారు చేసుకుని భూమిని నలువైపులా చదరంగా ఉండేలా చూడాలి.
● ఒక వరుసలో ఇటుకలు అడ్డంగా నిలబెడుతూ సమానంగా పరుచుకుంటూ వెళ్లాలి.
● గుంతలో ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయేలా ఒక ఇటుకను బోర్లా పరిస్తే సరిపోతుంది. ఇటుకలే కాకుండా రైతులు తమకు అందుబాటులో ఉన్న వాటిని తొట్టిలాగా నిర్మించుకోవచ్చు.
● తయారు చేసుకున్న మడిలో కప్పడానికి 2.5 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, 150 జీఎస్‌ఎం మందం కలిగిన పాలిథీన్ షీట్‌ను ఉపయోగించాలి.
● తొట్టిలోతు 10 సెం.మీకు మించకుండా.. 30 నుంచి 35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మెత్తటి మట్టిని షీట్‌మీద సమానంగా పరిస్తే సరిపోతుంది.
జాగ్రత్తలు.. ఉపయోగాలు..
● వరి నాటిన తరువాత సుమారు 200 కిలోల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.
● ఆ తరువాత నీటిని తొలగిస్తే 3 నుంచి 4 రోజులలో నత్రజని, ఇతర పోషకాలు మొక్కకు అందిస్తుంది. అవకాశం ఉన్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
● పశువుల దాణాగానే కాకుండా గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలకు కూడా ఉపయోగపడుతుంది.
● దీని వాడడం వల్ల కోడి మాంసం, గుడ్డు నాణ్యత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. గ్రాస్కార్సు వంటి గడ్డి తినే చేపలు అజోల్లాను ఇష్టంగా తింటాయి.
అజోల్లా అంటే ఏమిటి?
అజోల్లా నీటిపై తేలియాడుతూ పెరిగే ఫెర్న్ జాతికి చెందిన మొక్క. ఒక్కో మొక్క 2 సెంటీ మీటర్ల వెడల్పుతో చిన్న చెరువులు, కుంటల్లో త్వరగా పెరుగుతుంది. కాండం అడుగున ఉన్న వేరు వ్యవస్థ క్రమంగా పైకి రావడంతో ఇది నీటిపై తేలియాడుతూ నాచులా కనిపిస్తుంది. అనాబినా అనే సైనో బాక్టీరియాకు ఆశ్రయం కల్పించి వాయు రూపంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులో ఉంచుతుంది. నత్రజనిని మాత్రమే కాకుండా సేంద్రియ కర్బనం, పొటాషియంలను వరిపైరుకు అందిస్తుంది. దశాబ్దాల కాలంగా దీనిని వరిలో జీవ ఎరువుగా ఉపయోగిస్తున్నారు.
అధిక లాభాలు..
అజోల్లా వల్ల వరిపంటకే కాకుండా ఇతర వాటికి కూడా అధిక లాభాలు ఉన్నాయి. పంటకు పెట్టుబడుల ఖర్చు తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. రైతులు అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలి. – డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ,
కేవీకే ప్రోగామ్ కోఆర్డినేటర్
అవగాహన కల్పిస్తున్నాం..
అజోల్లా పెంపకం, వినియోగం, లాభాలపై రైతాంగానికి అవగాహన కల్పించి వినియోగించుకునేలా చర్యలు చేపట్టాం. రైతులు కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే ఎంతో ఉపయోగం.
– పి.రవికుమార్, ఏడీఏ, అశ్వారావుపేట

వరి పైరుకు ఊతమిచ్చేలా..

వరి పైరుకు ఊతమిచ్చేలా..