
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 637 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.36,720 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.19,450 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
భద్రాచలంటౌన్: విశాఖపట్నంలోని బీచ్ రోడ్‌లో అయోధ్య రెప్లికే టెంపుల్‌లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని భద్రాద్రి దేవస్థాన ఈఓ ఎల్.రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి దేవస్థానానికి చెందిన ఆస్థాన పండితులు వస్తున్నారని ప్రచారం చేసి కల్యాణం నిమిత్తం సుమారు రూ.3 వేలు భక్తుల నుంచి వసూలు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులకు ఓ వీడియో ద్వారా తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రచారంతో భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని, దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమం కల్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు మోసపోవద్దని ఈఓ సూచించారు.
అక్రమంగా పామాయిల్ గెలల కొనుగోలు
దమ్మపేట: ఓ రైతుకు చెందిన పామాయిల్ గెలలను బెల్ట్ షాపు నిర్వాహకుడు అక్రమంగా కొనుగోలు చేసిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గుత్తవారిగూడెం గ్రామానికి చెందిన చెలమాల రాము తన పామాయిల్ తోటలో గెలలు కోసి, ట్రాక్టర్‌లో అప్పారావుపేట ఫ్యాక్టరీకి పంపించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్.. ఐదు క్వింటాళ్ల గెలలను దమ్మపేటలోని ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడికి అక్రమంగా విక్రయించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైతు మరి కొందరు రైతులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశాడు. అదే ప్రాంతంలో వేరే రైతులకు చెందిన పామాయిల్ గెలలు కూడా ఉండడాన్ని గమనించిన రైతులు అక్రమంగా ఎందుకు కొనుగోలు చేస్తున్నావంటూ బెల్ట్ షాపు నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత రైతు తెలిపాడు.
చదువుతోనే సమాజ మార్పు
కొత్తగూడెంఅర్బన్: చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని బామ్ సెఫ్ నేషనల్ కేడర్ తెలంగాణ ఇన్‌చార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం ఎస్‌సీబీనగర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగంపై అవగాహన ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, చిరంజీవి ఆఫాన్, సంతోష్ కుమార్, బాసిత్, సుగుణారావు, ఎస్.వెంకటేశ్వర్లు, గోనె శ్రీకాంత్, బాలశౌరి, మల్లెల రామనాథం, కొండ పెద్దన్న, శివ, నబీ సాహెబ్, పర్వీన్, వేంకటముత్యం, కృష్ణయ్య , ఛత్రునాయక్, ప్రసాద్ పాల్గొన్నారు.
జయప్రదం చేయండి
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యాననిర్వహించనున్న దశలవారీ పోరాటాలను జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని కోరారు. ఆదివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి దశగా ఈ నెల 23, 24 తేదీల్లో మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రం, రెండో దశలో ఆగస్టు 1న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా, మూడో దశలో ఆగస్టు 23న చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, రాందాస్, నరసయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి