
పండితాపురంలో చోరీ..
కామేపల్లి: ఇంటి తాళం వేసి ఊరెళ్లిన ఓ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడేపూడి అనురాధ ఇటీవల హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు శనివారం రాత్రి గేటు, ఇంటి తాళాలు పగలకొట్టి చోరికి పాల్పడ్డారు. ఈనేపథ్యాన ఆదివారం పని మనిషి ఇంటి ఆవరణాన్ని ఊడ్చేందుకు వెళ్లగా.. గేటు తాళాలు తీసి ఉండడంతో అనుమానం వచ్చి ఇంటి వెనకకు వెళ్లగా తలుపు పగలకొట్టి ఉంది. దీంతో చోరీ జరిగిందని గుర్తించి స్థానికులతో కలిసి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడేసి ఉండడంతో పాటు బీరువాలోని సుమారు నాలుగు కేజీల వెండి వస్తువులు, అభరణాలతో పాటు పట్టు చీరలను దోచుకెళ్లినట్లు గుర్తించారు.
మల్లెలమడుగులో..
అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కొండా తిరుపతయ్య దంపతులు ఆదివారం ఉదయం 11 గంటల సమయాన ఇంటికి తాళం వేసి భద్రాచలంలోని కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగి సాయంత్రం 4గంటల సమయాన ఇంటికి రాగా ఇంటి వెనుక ద్వారం తీసి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలోని సుమారు 20 తు లాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ అశోక్‌రెడ్డి చోరీ ఘటనను పరిశీలించి విచా రించారు. క్లూస్ టీం ఫింగర్‌ప్రింట్లు సేకరించారు.
ద్విచక్ర వాహనాన్ని
ఢీకొట్టిన కారు..
చింతకాని: మండలంలోని లచ్చగూడెం గ్రామ సమీపాన శనివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన నర్మదలకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వెంకటేశ్వర్లు ఆదివారం తన ద్విచక్ర వాహనంపై తూటికుంట్ల గ్రామం నుంచి ఖమ్మం వెళ్తుండగా.. లచ్చగూడెం గ్రామంలో నర్మద అతడిని లిఫ్ట్ అడిగి ఎక్కింది. ఈక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారిరువురికి గాయాలు కాగా వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై నాగుల్‌మీరా కేసు నమోదు చేశారు.
విద్యార్థినికి పాముకాటు
దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పైదిగూడెం గ్రామానికి చెందిన కంగాల నవ్యశ్రీ ఆదివారం పాముకాటుకు గురైంది. హాస్టల్ ఆవరణలో తోటి విద్యార్థులతో ఉండగా పాము కరిచింది. దీంతో హాస్టల్ వార్డెన్ లక్ష్మీపతి హుటాహుటిన ములకపాడు వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.