
భూవివాదంలో కుటుంబం వెలి
టేకులపల్లి: టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామంలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో న్యాయం చేయాలని కోరిన కుటుంబాన్ని పెద్దలు కులం నుంచి వెలి వేస్తూ తీర్మానించారు. అంతేకాక ఈ విషయాన్ని గ్రామంలో టంకా వేయించడంతో ఆ కుటుంబం ఆవేదనకు గురవుతోంది. రోళ్లపాడు గ్రామానికి చెందిన పూనెం రామస్వామి – వెంకటరమణ దంపతులకు చెందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమిని అదే గ్రామానికి చెందిన కొడెం ముత్తయ్య కుటుంబీకులు ఆక్రమించి బోరు వేశారు. ఇదేంటని అడిగితే దౌర్జన్యానికి పాల్పడడంతో పటేల్ చీమల లక్ష్మీనారాయణ నాయకత్వాన గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. అక్కడ అందరి ముందే రామస్వామి దంపతులపై దాడి జరిగింది. మరుసటి రోజు బోరు ధ్వంసం కావడంతో రామస్వామే కారణమని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి మరోమారు పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి ఆలస్యంగా వచ్చారనే నెపంతో పటేల్, గ్రామ పెద్దలు, గ్రామస్తులంతా ఏకమై రామస్వామి కుటుంబాన్ని వెలివేస్తూ తీర్మానించారు. ఇకపై గ్రామస్తులెవరూ వారితో పాటు వారి కుటుంబీకుల ఇళ్లు, పొలాల్లో పనికి వెళ్లొద్దని చెప్పడమే కాక మాట్లాడొద్దని ఆదేశించారు. ఈ విషయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.50వేలు జరిమానా విధిస్తామని మైక్ ద్వారా గ్రామంలో టంకా వేయించారు. దీంతో ఆవేదనకు గురైన రామస్వామి దంపతులు సోమవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు విన్నవించడమే కాక టేకులపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణ
రోళ్లపాడులో కుటుంబాన్ని వెలివేసినట్లు ఫిర్యాదు అందడంతో డీఎస్పీ నూనావత్ చంద్రభాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్‌ఐ అలకుంట రాజేందర్ గ్రామానికి వెళ్లి వివాదాస్పదమైన భూమిని పరిశీలించారు. ఆపై ఇరు వర్గాలను విచారించారు. అనంతరం గ్రామంలో ఇరువర్గాలతో సమావేశమై కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామ, కుల బహిష్కరణలు, వెలివేయడం చట్టరీత్యా నేరమని.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమి పత్రాలతో రెవెన్యూ, అటవీ ఆధికారుల ద్వారా సర్వే చేయించి హద్దులు నిర్ణయించుకునే వరకు ఎవరూ వెళ్లొద్దని స్పష్టం చేశారు.
రోళ్లపాడులో వెలుగుచూసిన ఘటన
గ్రామంలో విచారణ చేపట్టిన పోలీసులు

భూవివాదంలో కుటుంబం వెలి