
కోల్ మూమెంట్ ఈడీగా బాధ్యతల స్వీకరణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బి.వెంకన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2010 ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్(ఐఆర్‌టీఎస్)కు చెందిన వెంకన్న మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై ఈ పదవిలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎండీ ఎన్.బలరామ్‌ను కలిశారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ప్రతీ సంవత్సరం సుమారు 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా అవుతుందని, ఇందులో అధిక భాగం రైల్వే ద్వారానే పలు రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ సాధిస్తున్న వార్షిక లక్ష్యాల సాధనలో కోల్‌మూమెంట్ విభాగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, ఈ బాధ్యత కోల్‌మూమెంట్ ఈడీదేనని అన్నారు. అనంతరం ఈడీ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిబద్ధతతో పని చేస్తానని, లక్ష్య సాధనకు కృషి చేస్తానని చెప్పారు.
నేడు కరకగూడేనికి
విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
కరకగూడెం: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మంగళవారం కరకగూడెం మండలం భట్టుపల్లికి రానున్నారు. గ్రామంలోని రైతు వేదికలో కంది పంట విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పిస్తారు. కంది విత్తనోత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా రైతుల ఆదాయం పెంచడం తదితర అంశాలపై చర్చించనున్నారు. విత్తనోత్పత్తిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కార మార్గాలపై రైతులతో మాట్లాడుతారని మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ తెలిపారు. రైతులు నేడు ఉదయం 11 గంటల వరకు రైతు వేదిక వద్దకు రావాలని కోరారు.