
25 నుంచి శ్రావణ మాసోత్సవాలు
ఆగస్టు 4 నుంచి 9 వరకు
రామాలయంలో పవిత్రోత్సవాలు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 25 నుంచి శ్రావణమాసోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు మంగళవారం వివరాలు వెల్లడించారు. 25న ఫుష్యమి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పట్టాభిషేకం, ప్రత్యేక నవకలశ స్నపన తిరుమంజనం, సామూహిక అష్టోత్తర శతనామార్చన, 28న అండాళ్ అమ్మవారికి తిరుమంజనం, ఆగస్టు 1న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి కుంకుమార్చన, సంధ్యాహారతి జరపనున్నారు. ఆగస్టు 4న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 5న అగ్నిప్రతిష్ఠ, పవిత్రాధివాసం, అష్టోత్తర శతకలశావాహనం, 6న స్నపన తిరుమంజనం, పవిత్రారోపణం, హోమం, 7న ప్రత్యేక పవిత్రోత్సవముం, 8న శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతం, సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. 9న హయగ్రీవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, ఉత్సవ సమాప్తి, 15న సామూహిక కుంకుమార్చన, 19న సర్వ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన, 22న అమ్మవారికి పుష్పాంజలి తదితర పూజలు ఉంటాయని అధికారులు వివరించారు. కాగా 24 నుంచి 28 వరకు అండాళ్ అమ్మవారి తిరునక్షత్రత్సోవాల సందర్భంగా రాత్రి విశేష సేవాకాలం, విశేష భోగాలను రద్దు చేశారు. పవిత్రోత్సవాలు సందర్భంగా 5 నుంచి 9 వరకు నిత్యకల్యాణాలు రద్దు చేసినట్లు వెల్లడించారు.