
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడి
అశ్వాపురం/కరకగూడెం : రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటు మేలైన వంగడాలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్.అన్వేష్‌రెడ్డి అన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, నానో ఎరువులను పిచికారీ చేయాలని, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. మంగళవారం ఆయన అశ్వాపురంలో పత్తిసాగు, కరకగూడెం మండలం భట్టుపల్లి రైతు వేదికలో కంది విత్తనోత్పత్తిపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మాట్లాడారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, విత్తనోత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. రైతు పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లాభాల బాట పట్టాలని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పప్పు దినుసుల పంటల్లో ఒకటైన కంది విత్తనోత్పత్తిలో రైతులు క్రియాశీలకంగా పాల్గొంటే స్వయం సమృద్ధి సాధించవచ్చని సూచించారు. అవసరమైన సాంకేతి సహాయం అందించడానికి విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏడీఏ తాతారావు, ఏఓ చటర్జీ, ఏఈఓలు ప్రశాంత్, అనిల్ కుమార్, ఇఫ్కో సంస్థ మేనేజర్ నాగార్జున, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు పాల్గొన్నారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి