
అవే సమస్యలు
అప్‌గ్రేడ్ అయినా..
నేడు మంత్రి, ఉన్నతాధికారుల పరిశీలన..
యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, అవసరమైన వసతులు, నిధుల కేటాయింపు తదితర అంశాలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు యూనివర్సిటీ వీసీ, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, తెలంగాణ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, ప్రొఫెసర్ రాంచందర్ తదితరులు బుధవారం రానున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వీరు అందించే ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని అదనంగా నియమించడం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం కేఎస్‌ఎంలోని మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరమే తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ.. వైస్ చాన్స్‌లర్ నియామకం మినహా ఎలాంటి నిధులు, సౌకర్యాలు సమకూర్చలేదు. ప్రస్తుతం ఇక్కడ 11 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా మరో ఎనిమిది మంది కాంట్రాక్టు పద్ధతిన నియమితులయ్యారు. 45 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్లు మొదలై తరగతులు ప్రారంభిస్తే క్లాస్‌రూమ్‌లు సరిపోయినా.. కొత్తగా వచ్చేవారికి హాస్టళ్లతో పాటు ఇతర సౌకర్యాలూ కష్టమే. ఒకటి, రెండు సెమిస్టర్లు ఎలాగో నెట్టుకొచ్చినా వచ్చే ఏడాది వరకు అన్ని వసతులు కల్పించాలి. లేదంటే యూనివర్సిటీ సజావుగా సాగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న హాస్టల్, మెస్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గదులు వర్షమొస్తే కురుస్తున్నాయి. ఇక యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ అంతా పిచ్చి మొక్కలు, పాము పుట్టలతో నిండి ఉంది. రోడ్ల పరిస్థితీ అధ్వానంగానే ఉంది. హాస్టళ్లతో పాటు ఇతర అన్ని నిర్మాణాలకూ సరిపడా స్థలం ఉన్నా నిధులు లేవు.
పరిహారమూ అందలేదు..
గతంలో కళాశాల స్థాయిలో ఉన్నప్పడే ఏర్పాటైన ప్రత్యేక కమిటీ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ మేరకు హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ యూనివర్సిటీ మొత్తం 300 ఎకరాల్లో విస్తరించి ఉండగా కలెక్టరేట్ నిర్మాణానికి 20 ఎకరాలు, ఎస్పీ కార్యాలయానికి 20 ఎకరాలు, మెడికల్ కాలేజీకి 30 ఎకరాలు తీసుకున్నారు. ఇవన్నీ కలిపి పరిహారంగా రూ.168 కోట్లు రావాల్సి ఉండగా అవి కూడా ఇంతవరకు అప్పగించలేదు. దీంతో కళాశాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ బోర్డు ఏర్పాటు
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరును డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా ఇప్పటికే మార్చగా.. మంగళవారం నూతన బోర్డు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి సందర్శించనున్న నేపథ్యంలో ఈ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు నేటి సమావేశ హాల్‌ను సైతం సిద్ధం చేశారు.
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని వీడని కష్టాలు..
కళాశాల ఆవరణలో పిచ్చిమొక్కలు, పాముల పుట్టలు
నిధులు విడుదలైతేనే అభివృద్ధికి అవకాశం
నేడు మంత్రి తుమ్మలతో పాటు వీసీ బృందం పరిశీలన
యోగితారాణా పర్యటన ఇలా..
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్, మెడికల్, ఇంజనీరింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించి, వీసీలతో సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యోగితా రాణా శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలను పరిశీలించనున్నారు. 3.30 గంటలకు భవిత కేంద్రాన్ని, సాయంత్రం 6.30 గంటలకు కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేయనున్నారు. అనంతరం బూర్గంపాడులోని టీజీఆర్‌జీఐఎస్ పరిశీలన, విద్యార్థులు, సిబ్బందితో సమీక్షించి, రాత్రికి అక్కడే బస చేస్తారని తెలిసింది.
ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా రామచంద్రం
కేయూ క్యాంపస్: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు వీసీ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ప్రొఫెసర్ రామచంద్రం 1991లో కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులై ప్రస్తుతం సైకాలజీ విభాగం అధిపతిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి 31న కేయూ రిజిస్ట్రార్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే, కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అసోసియేట్ ప్రొఫెసర్ జగన్‌మోహన్‌రావును ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా నియమించారు.

అవే సమస్యలు

అవే సమస్యలు